వనపర్తి: దివ్యాంగులకు సంబంధించిన యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అఽధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న యూడీఐడీ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 2025, మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,647 యూడీఐడీ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం 782 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆయా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.


