వనపర్తి రూరల్: జిల్లాలోని అసంఘటితరంగ కార్మికులందరినీ ఏకం చేసి వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాలరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం పెబ్బేరులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సంఘం జిల్లా 4వ మహాసభల ముగింపు కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ ఎన్నికకు ఉప ప్రధానకార్యదర్శి నర్సింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రతిఘటించేందుకు, హక్కులు కాపాడుకునేందుకు కార్మిక లోకాన్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీహరి, ప్రధానకార్యదర్శిగా మోషా, ఉపాధ్యక్షులుగా రఘు, శ్యాంసుందర్, సహాయ కార్యదర్శులుగా శ్రీరామ్, గోపాలకృష్ణ, కోశాధికారిగా భాస్కర్‌తో పాటు 15 మంది కార్యవర్గసభ్యులు ఎన్నికయ్యారు. జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు.


