రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

భీమా ఫేజ్‌–1, ఫేజ్‌–2కు నీటిని

విడుదల చేసిన ఎమ్మెల్యేలు

కొత్తకోట/మదనాపురం: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదుగాకపోయినా, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సాగునీటిని విడుదల చేస్తున్నామని వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం కొత్తకోట, మదనాపురం మండలాల మధ్యలో ఉన్న భీమా ఫేజ్‌–1, మదనాపురం మండలం తిర్మలాయపల్లి సమీపంలో రామన్‌పాడు జలాశయ బ్యాక్‌వాటర్‌ ద్వారా శంకరసముద్రం భీమా ఫేజ్‌–2 ఎత్తిపోతల పథకం ద్వారా దిగువకు నీటిని విడుదల చేసి ఆయా ప్రాంతాల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎగువన కర్ణాటక నుంచి జూరాలకు వరద వస్తోందని.. జలాశయంలో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వదులుతున్నామన్నారు. రైతుల పొలాలు పచ్చగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని.. అవసరమైన మేర నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదని, నేడు సాగునీటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతోనే నీరు విడుదల అవుతుంటే, వాటి ఘనతను వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నారని.. ప్రజల అవసరాలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలు, ఫామ్‌హౌస్‌ల నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. శంకరసముద్రం రిజర్వాయర్‌కు నీటి విడుదలతో పరిసర ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా తాగునీటి ఎద్దడి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భీమా ఫేజ్‌–2 నీటి విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌ పోతుగంటి రాములు, మండలపార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement