నిధులున్నా.. నిట్టూర్పే! | - | Sakshi
Sakshi News home page

నిధులున్నా.. నిట్టూర్పే!

Jul 17 2026 1:04 AM | Updated on Jul 17 2026 1:04 AM

కొత్త పురపాలికల్లో కానరాని అభివృద్ధి పనులు

ప్రత్యేక నిధులు రూ.15 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

సీసీ రహదారులు, డ్రైనేజీలు

తదితర పనులకు ప్రాధాన్యం

అరకొర టెండర్లు.. ప్రారంభం కాని పనులు

జిల్లాలో అమరచింత, ఆత్మకూర్‌, కొత్తకోట, పెబ్బేరు కొత్త పురపాలికలు. ఆయా పురపాలికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించిన జీఓలు సైతం విడుదల కావడంతో ఆయా పుర ప్రజలు సంబురపడ్డారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కౌన్సిలర్లు ఆ నిధులతో తమ వార్డుల్లో అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించారు. కానీ నేటికీ ఆయా పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అనే విషయాలు సైతం తెలియని పరిస్థితి నెలకొంది. అమరచింతలో రూ.3 కోట్లు, ఆత్మకూర్‌లో రూ.7 కోట్ల పనులకు సంబంధించి టెండర్లు, అగ్రిమెంట్‌ ప్రక్రియ పూర్తయిందని ఆయా పుర కమిషనర్లు చెబుతున్నారు. ఇక కొత్తకోట, పెబ్బేరు పురపాలికల్లో మాత్రం వాటి ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. నిధులు మంజూరయ్యాయి.. మరి పనులెప్పుడు ప్రారంభిస్తారని అడుగగా నిధుల మంజూరు కేవలం జీఓలకే పరిమితమైందని అధికారులు బదులివ్వగడం గమనార్హం.

అమరచింత: కొత్త పురపాలికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని నాలుగు పురపాలికలకు కూడా ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున రూ.60 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులను గతేడాది జారీ చేసింది. పుర ఎన్నికల సమయంలో జనవరి 13న అమరచింత పురపాలికలో అభివృద్ధి పనులకుగాను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపనలు కూడా చేశారు. ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా పనుల గురించి చర్చించే అధికారులే కరువయ్యారు. పుర అధికారులను అడిగిన ప్రతిసారి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.. త్వరలోనే ప్రారంభిస్తామని సమాధానం చెప్పడమే తప్పా ఆచరణలో అమలు కావడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ రహదారులు, డ్రైనేజీలు, పురపాలిక భవనం, టౌన్‌హాల్‌తో పాటు వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని పుర ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం పురపాలికల్లో కొనసాగుతున్న అమృత్‌ 2.0 తాగునీటి పథకం పనులతో సీసీ రహదారులు దెబ్బతిన్నాయని.. వచ్చే నిధులతో వేగవంతంగా నిర్మించాలంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement