ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో వేగం పెంచాలి

Jul 17 2026 1:04 AM | Updated on Jul 17 2026 1:04 AM

వనపర్తి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు మల్లు రవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెనన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి ఆయనతో పాటు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో 2018 నుంచి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాటి విచారణ, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, బాధితులకు అందిన పరిహారంపై సమీక్షించారు. 2025 నుంచి 2026 వరకు విచారణలో ఉన్న 12 కేసులపై చర్చించగా.. ఎస్పీ సునీతారెడ్డి వాటి పురోగతి, స్థితిగతులను కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 2020 నుంచి 2026 వరకు ఒక్క కేసు నేరారోపణ జరగలేదని ఇందుకు బాధ్యులెవరని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం కచ్చితంగా శిక్ష పడాలని, బాధితులకు న్యాయం జరగాలన్నారు. ఒకవేళ తప్పుడు కేసులు నమోదు చేస్తే విజిలెనన్స్‌ కమిటీ సభ్యులు నచ్చజెప్పి కేసు ఉపసంహరించుకునేలా చూడాలని సూచించారు. తప్పుడు కేసులు నమోదు చేయడం, తప్పు చేసినవారు శిక్ష పడకుండా బయట దర్జాగా తిరుగుతుండటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కేసులను సమగ్రంగా విచారించి తగిన ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 2020లో నమోదైన ఒక కేసు 2026లో ట్రయల్‌కు రావడం ఇంకా తేదీ ఖరారు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమావేశానికి అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి..

భూ సమస్యలు, భూ కబ్జాల వంటి కేసులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూర్చి అండగా నిలవాలని పోలీస్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతినెల పౌరహక్కుల దినోత్సవం పకడ్బందీగా నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించి భరోసా ఇవ్వాలని సూచించారు. మంజూరైన సంక్షేమ పథకాలపై శాఖల వారీగా అధికారులతో ఆరా తీశారు. ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులకు సకాలంలో అందేవిధంగా చూడాలన్నారు. ప్రభుత్వం మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తుంటే.. వసతి గృహాల్లో వార్డెన్లు సరిగా ఉండటం లేదని, పర్యావసానంగా విద్యార్థులు నష్టపోతున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement