‘సర్‌’ ప్రక్రియ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియ వేగవంతం

Jul 17 2026 1:04 AM | Updated on Jul 17 2026 1:04 AM

వనపర్తి రూరల్‌: సర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ, ఆన్‌లైన్‌ నమోదును వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం మండలంలోని చిమనగుంటపల్లిలో పర్యటించి ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ, ఆన్‌లైన్‌ వివరాల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేసి, పూర్తి చేసిన తర్వాత త్వరిగతిన సేకరించాలన్నారు. సేకరించిన ఫారాల వివరాలను రోజువారీగా ఆలస్యం లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పెండింగ్‌ లేకుండా చూడాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఓటర్లకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడి మధాహ్న భోజనంపై ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మధు, బీఎల్వోలు, బీఎల్‌ఏలు ఉన్నారు.

తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి

పాన్‌గల్‌: తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి అభివృద్ధికి సహకరించేలా మహిళా సంఘాల సభ్యులకు సమాఖ్య సిబ్బంది అవగాహన కల్పించాలని డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ (డీపీఎం) నాగమల్లిక అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన ఈసీ సమావేశం, సీఆర్పీల శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించడంతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సభ్యులకు వివరించాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు యూనిఫామ్స్‌ను సర్పంచ్‌ నాగలక్ష్మితో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్‌ఓ హేమలత, సమాఖ్య సీసీలు సువర్ణ, వసంత, సమాఖ్య అధ్యక్షురాలు జయమ్మ, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేయాలి

పాన్‌గల్‌: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను గ్రామాల వారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డా. మారుతినందన్‌గౌడ్‌ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చేపట్టే పరీక్షలు, అందించే మందులు, ఆన్‌లైన్‌ నమోదు తదితర అంశాలపై వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రక్తపోటు(బీపీ), మధుమేహం, క్యాన్సర్‌ (నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు) పరీక్షలు ఉచితంగా నిర్వహించడమేగాక చికిత్స, మందులు అందించే విషయాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. విధుల్లో అలసత్వం సరికాదని హెచ్చరించారు. సమావేశంలో ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్లు కొండ శ్రీనివాస్‌, అశోక్‌, మధుమోహన్‌, ఆయుష్మాన్‌ వైద్యులు డా. మైథిలి, లారెన్స్‌, నాగరాజు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ

ఉండవెల్లి: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్‌గౌడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీతోపాటు బీఎడ్‌ అర్హతతో పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌, అనుభవ ధ్రువపత్రాలు, జడ్చర్లలోని ఆర్‌సీఓ ఆఫీస్‌లో ఈ నెల 20లోగా దరఖాస్తులతోపాటు అందజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement