ఇవే మా మొదటి ప్రాధాన్యం: సీఎం రేవంత్‌రెడ్డి
–8లో u
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/వనపర్తి: ‘నేను పాలమూరు బిడ్డను. అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శ జిల్లాగా చేయాలనేదే నా ప్రయత్నం. గతంలో ఈ జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారనే చర్చలు జరిగేవి. ఈ రోజు మనమే ఇతర జిల్లాలను ద్తతత తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది పాలమూరు జిల్లాకు గర్వకారణం. ఈ జిల్లాలో మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఏటీసీ సెంటర్లను తీసుకొచ్చాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో బుధవారం ఆయన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం కొత్తకోటలో రూ.1.77 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
త్వరలో శుభవార్త చెబుతాం..
‘సాగురంగం అభివృద్ధి సాధించాలంటే జిల్లాలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్ పూర్తి చేసుకోవాలి. ఆయా పథకాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నాం. పీఆర్‌ఎల్‌ఐకి సంబంధించిన 90 టీఎంసీలు సాధించడానికి కేంద్రం, ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి సంపూర్ణమైన అనుమతులు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో రైతులకు శుభవార్త చెబుతాం. డిండి ప్రాజెక్ట్‌కు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులు కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ జిల్లాను సస్యశ్యాలం చేస్తాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం తీసుకొస్తాం. నిరుద్యోగులకు ఉపాధి, అవకాశాలు కల్పిస్తాం. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాలు పోయి లక్షల మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. వైట్ కాలర్ జాబులు పోతున్నాయి. అయితే బ్లూ కలర్ జాబులు తెచ్చేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. బ్లూ కలర్ జాబులు కావాలంటే ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత విద్యతో స్పోర్ట్స్ నూతన విధానం అమలు చేసి చదువులో వెనకబడిన వారు క్రీడల్లో రాణించి ఉన్నత జీవితాన్ని కొనసాగించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలి. విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి. మీ భవిష్యత్‌కు నాదీ హామీ. క్రీడల్లో రాణించే వారిని ఉన్నతస్థాయిలో నిలిపే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీలు డీకే అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాల సరిత, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం
విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి
ఆదర్శ జిల్లాగా పాలమూరును మారుస్తామని హామీ
కొత్తకోటలో బాలికల నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం


