జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచులు గ్రామ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల పరిషత్ పాలకవర్గం ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలో సర్పంచులు తమ గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చేవారు. ఫలితంగా ఆయా సమస్యలు కొద్దో గొప్పో పరిష్కారానికి నోచుకునేవి. కానీ, ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు జరపకపోవడంతో మండల పాలకవర్గాలు లేవు. దీంతో గత డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ సమస్యలు ఎవరికి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలకోసారి..
గతంలో మండల పరిషత్ పాలక వర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతి మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులు హాజరయ్యేవారు. డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనేవారు. అలాగే మండలంలో ప్రతి శాఖ అధికారి తమ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, విద్యుత్, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఐకేపీ, ఉపాధి హామీ, పశుసంవర్ధక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో ఆయా గ్రామాల సర్పంచులు తమ సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. డివిజన్ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికలుగా మారేవి.
ఎలా చెప్పాలి..
గడువు ముగిసిన వెంటనే పంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచులు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఎవరికి విన్నవించాలో తెలియని స్థితిలో సర్పంచ్‌లు
గతంలో మూడు నెలలకోసారి మండల సభలు
ప్రస్తుతం పాలకవర్గాలు లేకపోవడంతో అయోమయం


