జిల్లాలో ముఖ గుర్తింపు హాజరు అమలు
కూలీలకు భద్రత..
● కూలీలు ముఖం చూపిస్తేనే కూలి
● పారదర్శకత దిశగా ముందడుగు..
● దొంగ హాజరుకు చెల్లుచీటి
మదనాపురం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో హాజరు అక్రమాలకు తెరపడినట్లయింది. ఇకపై క్షేత్రస్థాయిలో కూలీల హాజరు కేవలం సంతకాలు, వేలిముద్రలతో కాకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ విధానాన్ని జిల్లావ్యాప్తంగా ఉపాధి పనుల్లో తప్పనిసరి చేశారు.
పారదర్శకతే లక్ష్యంగా..
గతంలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలు పనులకు రాకపోయినా వచ్చినట్లుగా మస్టర్లలో తప్పుడు హాజరు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దొంగ హాజరుతో అర్హులైన కూలీలకు నష్టం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యేది. ఈ అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను జోడించింది.
ఎలా పనిచేస్తుంది?
కూలీలు పని ప్రదేశానికి చేరుకున్నాక మేటీ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ తన స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా కూలి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ఈ యాప్ నేరుగా కూలి ఆధార్ డేటాకు అనుసంధానమై ఉంటుంది. ముఖం సరిపోలితేనే హాజరు నమోదవుతుంది. కేవలం ఫొటో మాత్రమే కాకుండా సమయం, పని ప్రదేశం కూడా రికార్డు అవుతుంది. జిల్లాలో 87,410 యాక్టివ్ జాబ్ కార్డులు, 1,21,009 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ముఖగుర్తింపు హాజరుతో కేవలం క్షేత్రస్థాయిలో పనిచేసే కూలీలకే వేతనం అందే అవకాశం ఉంటుంది. అర్హత లేని, డూప్లికేట్ కార్డులు, వలస వెళ్లిన వారి జాబ్‌కార్డులను అధికారులు జాబితా నుంచి తొలగించారు. జిల్లాలో 1.21 లక్షల జాబ్‌కార్డులు ఉన్నప్పటికీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో 87 వేల కుటుంబాలు మాత్రమే క్రియాశీలకంగా పని చేస్తున్నాయి.
మండలాల వారీగా
కూలీల సంఖ్య
మండలం సంఖ్య
పాన్‌గల్ 13,908
పెబ్బేరు 11,181
వనపర్తి 10,168
ఖిల్లాఘనపురం 9,729
కొత్తకోట 9,721
చిన్నంబావి 9,624
వీపనగండ్ల 9,372
పెద్దమందడి 8,145
గోపాల్‌పేట 7,456
మదనాపురం 7,379
శ్రీరంగాపురం 6,464
ఆత్మకూర్ 6,110
అమరచింత 5,004
రేవల్లి 4,026
ఏదుల 2,722
సాంకేతికత ఎంత పెరిగినా అది క్షేత్రస్థాయిలో సామాన్యుడికి న్యాయం చేసినప్పుడే దానికి సార్థకత. ముఖ గుర్తింపు హాజరుతో నిజాయితీగా పనిచేసే కూలీలకు భద్రత లభిస్తుంది. అయితే మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేని చోట సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను బలోపేతం చేయనుంది.
– సుల్తాన్, ఏపీడీ, వనపర్తి


