కిటకిటలాడిన ఆలయాలు
● ఆలయాల్లో పంచాంగ శ్రవణం
● జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాల్గొన్న ఎమ్మెల్యే
తూడి మేఘారెడ్డి
వనపర్తిటౌన్: తెలుగు వెలుగుల ఉగాదిని గురువారం జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, చింతల హనుమాన్, కన్యకాపరమేశ్వరి, వీరబ్రహ్మేంద్ర, రామాలయం, గణేష్ తదితర ఆలయాలతో పాటు శ్రీరంగాపురం రంగనాథస్వామి, గోపాల్‌పేట బుద్ధారం గండి ఆంజనేయస్వామి ఆలయాల్లో అర్చనలు అభిషేకాలు, పల్లకీ సేవలు శాస్త్రోకంగా జరిపించారు. అదేవిధంగా సాయంత్రం ఆలయ ఆవరణల్లో అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించారు.
శ్రీ పరాభవంలో శుభమే..
శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధర్మం, నీతి తప్పిన వారికి మాత్రమే పరాభవం ఎదురవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు ఓరుగంటి నాగరాజుశర్మ పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు, పశుసంపదకు కొదవలేదని చెప్పారు. వనపర్తి ప్రాంత కీర్తి తెలంగాణలో పెరుగుతుందని.. జిల్లా, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయని వివరించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు ప్రజల్లో గౌరవమర్యాదలు, ఆదరణ పెరుగుతాయని చెప్పారు. పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
● ఖిల్లాఘనపురం మండలంలోని గట్టుకాడిపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పండుగ సందర్భంగా గురువారం స్వామివారి పల్లకీసేవ నిర్వహించారు.
ఎద్దుల గిరక లాగుడు పోటీలో వృషభాలు


