పుర ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
అమరచింత/ఆత్మకూర్: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా గురువారం ఆయన అమరచింత, ఆత్మకూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పురపాలికల్లో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం, లెక్కింపు కేంద్రాలతో పాటు మౌలిక వసతులను పరిశీలించారు. ఆయా పుర కమిషనర్లు నాగరాజు, చికినె శశిధర్‌తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితా సవరణ కొనసాగుతుందన్నారు. వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తూ తుడి ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆత్మకూర్‌లో 11 ఫిర్యాదులు అందగా వెంటనే పరిష్కరించామన్నారు. 10 వార్డులకుగాను 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.


