డీఎస్పీ ఆకస్మిక తనిఖీ
వీపనగండ్ల: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల ఆన్‌లైన్ నమోదు, వచ్చిన ఫిర్యాదులు, తీసుకుంటున్న చర్యలు, పరిసరాలను పరిశీలించారు. ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్‌ఐ రాణి తదితరులు పాల్గొన్నారు.
రూ.2.50 కోట్లతో ఆధునిక ఠాణా..
అమరచింత: మండల కేంద్రంలో రూ.2.50 కోట్లతో ఆధునిక వసతులతో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి మరో మూడు ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరం అవసరం ఉండటంతో గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లు పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం దుంపాయికుంటలో ఉన్న 14 ఎకరాల్లో 7 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారని, మిగిలిన 7 ఎకరాలు పేదల ఇంటి స్థలాలకు ఇచ్చారని నాయకులు డీఎస్పీకి వివరించారు. చర్చలు సఫలం కాకపోవడంతో సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. కార్యక్రమంలో సీఐ శివకుమార్, ఎస్‌ఐ స్వాతి, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులు
ఉన్నతంగా ఎదగాలి
వనపర్తి టౌన్: విద్యార్థులు మహనీయుల స్ఫూర్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, డీఐఈఓ ఎర్ర అంజయ్య ఆకాంక్షించారు. గురువారం పట్టణంలోని ఆయా కార్యాలయాల్లో ఎస్‌ఎఫ్‌ఐ క్యాలెండర్‌ను సంఘం నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, కుటుంబం భరోసాను కోల్పోతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరన్న నాయక్, నాయకులు హరీశ్, నరేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అంబాభవాని ఆలయంలో ఆంధ్రా ఎమ్మెల్సీ పూజలు
కొత్తకోట రూరల్: పట్టణంలోని అంబాభవాని ఆలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఎల్లారెడ్డిగారి శివరాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఎమ్మెల్సీ ఆలయాన్ని తరచూ దర్శించుకుంటారని.. హైదరాబాద్ నుంచి అనంతపూర్‌కు వెళ్తూ వచ్చినట్లు వర్గీయులు తెలిపారు.
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
డీఎస్పీ ఆకస్మిక తనిఖీ
డీఎస్పీ ఆకస్మిక తనిఖీ


