సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం తగదు
వనపర్తి: సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం తగదని.. జాప్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రైస్‌మిల్లర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2024–25 యాసంగి సీజన్‌న్ వరి ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని కోరారు. 2014–15 నుంచి 2023–24 వరకు సీఎంఆర్ అప్పగింతలో విఫలమైన మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 125 శాతం బియ్యాన్ని తక్షణమే ప్రభుత్వానికి అందించాలన్నారు. బకాయిల చెల్లింపునకు ఇదే చివరి గడువని.. బియ్యం అప్పగించని పక్షంలో సదరు మిల్లర్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఆర్‌అండ్‌ఆర్ చట్టం కింద రికవరీ చేపడతామని, మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. బియ్యం నాణ్యతగా ఉండాలని, పౌరసరఫరాలశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ట్యాబ్‌ఎంట్రీలను నిర్లక్ష్యం చేయొద్దు..
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత ట్యాబ్ ఎంట్రీలు చేయడంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హెచ్చరించారు. ఓపీఎంఎస్ ట్యాబ్ ఎంట్రీల నిర్వహణలో ఏపీఎంలు, పీఏసీఎస్ సీఈఓలు చూపుతున్న జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గురువారం తన చాంబర్‌లో నిర్వహించిన సమీక్షలో ధాన్యం కొనుగోలు ప్రగతిని పరిశీలించి ట్యాబ్‌ఎంట్రీలు మందకొడిగా సాగుతుండటంపై అధికారులను నిలదీశారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తి చేయకపోవడంతో రైతులకు చెల్లింపులు ఆగిపోతున్నాయని, ఏపీఎంలు, సీఈఓల పనితీరు సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యానికి బాధ్యులైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లులకు చేరిన ధాన్యం వివరాలను మిల్లర్ల ద్వారా తక్షణమే ఆన్‌లైనన్‌లో అకనాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలని, రెండ్రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ట్యాబ్‌ఎంట్రీలన్నీ పూర్తి కావాలని, రోజూ నివేదిక సమర్పించాలన్నారు.


