జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం
వనపర్తి: రోడ్డు భద్రత నియమాలు పాటించడంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ నుంచి నల్ల చెరువు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా.. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత జెండా ఊపి ప్రారంభించడమేగాక ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమేగాక సిబ్బంది కూడా పాటించేలా చూడాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడిపి జీవితాలను నాశనం చేసుకోకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని, ఇటీవల అధికంగా ప్రమాదాలు జరిగినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారోత్సవాలను మాసోత్సవాలుగా మార్చాయని చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడమే గాకుండా ఎదుటి వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కోరారు.
అతివేగంతోనే అనర్థాలు..
రోడ్డు ప్రమాదాలతో నిత్యం ఎందరో మృతిచెందుతున్నారని.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ఇతరులకు అవగాహన కల్పించాలని ఎస్పీ డి.సునీతరెడ్డి కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధునిక వాహనాలు కొనివ్వడమే కాకుండా అధిక వేగంతో వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. యువత స్టైల్ కోసం హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం చేస్తారని.. ఆ పద్ధతి ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరించారు. బైక్ ర్యాలీ సందర్భంగా నల్లచెరువు కట్టపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాలాజీనాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి మానస, జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం పాల్గొన్నారు.


