లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు
వనపర్తి: పని ప్రదేశంలో మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని.. నిర్భయంగా లోకల్ కంప్లయింట్ కమిటీలో ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లోకల్ కంప్లయింట్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు పని చేసుకునేలా రక్షణ చట్టాలు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ఇప్పటికే స్థానికంగా ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, జిల్లాస్థాయిలో లోకల్ కంప్లయింట్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. బాధితులు 90 రోజుల్లో కమిటీకి లేదా షీ బాక్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల విధానాలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. 64 శాఖల్లో ఇంటర్నల్ కమిటీలు, లోకల్ కమిటీ సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాధ్యులను విచారించి ఆరోపణ నిర్ధారణ అయితే శిక్షలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, లోకల్ కమిటీ సభ్యురాలు డా. శ్రీలేఖ, జీసీడీఓ సుబ్బలక్ష్మి, శ్రీదేవి, రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, డీసీపీఓ రాంబాబు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


