మహిళల భద్రత, భరోసా షీటీం లక్ష్యం
వనపర్తి: మహిళలు షీటీం సేవలను వినియోగించుకోవాలని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ సూచించారు. మహిళలు, బాలికలకు భద్రత, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఎస్పీ సునీతరెడ్డి ఆదేశాల మేరకు షీటీం, భరోసా కేంద్రం, ఏహెచ్‌టీయూ సంయుక్తంగా జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు భయంతో మౌనంగా ఉండకూడదని, బాలికలు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాకూడదని కోరారు. ఈవ్‌టీజింగ్, వేధింపులు, ఆన్‌లైన్ బెదిరింపులు ఎదురైతే సంప్రదించాలని సూచించారు. ఫేక్ ఐడీలు, మోసపూరిత లింకులు, బ్లాక్‌మెయిల్, మార్ఫింగ్ వంటి సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. భరోసా కేంద్రంలో న్యాయం, కౌన్సెలింగ్, వైద్య సాయం, అవసరమైతే ఆశ్రయం కూడా లభిస్తుందని చెప్పారు. ఏహెచ్‌టీయూ, భరోసా కేంద్రం కలిసి మహిళల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో షీటీం ఎస్‌ఐ అంజద్, సిబ్బంది శ్రీనివాసులు, శ్రీశైలం చారి, యాదిరెడ్డి, భవిత, సతీష్, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


