మత్స్యబీజ సంబురం
● లక్ష్యం 1.60 కోట్లు..
ఇప్పటి వరకు వదిలినవి 60 లక్షలు
● 10వ తేదీలోపు పూర్తి చేస్తామంటున్న అధికారులు
జిల్లాలో కొనసాగుతున్న రాయితీ చేప పిల్లల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను త్వరగా పంపిణీ చేస్తే లబ్ధి చేకూరుతుంది. పెద్ద చెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో చేప పిల్లలు ఎదిగే అవకాశం ఉంది. ఈ చెరువుపై ఆధారపడి 300 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి.
– గోపి, మత్స్యకారుడు, అమరచింత
ప్రభుత్వం ఈసారి రాయితీ చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేస్తోంది. వానాకాలంలో వదలాల్సిన చేప పిల్లలు చలికాలం మధ్యలో చెరువులకు చేరుతున్నాయి. చేప పిల్లల ఎదుగుదలకు వాతావరణం సహకరించక కొన్ని చనిపోయినా.. మిగిలినవి పెరిగే అవకాశం ఉంది. అధికారులు త్వరితగతిన పంపిణీ ప్రక్రియ పూర్తి చేసి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి.
– తెలుగు రాములు, పాన్‌గల్
రాయితీ చేప పిల్లల సరఫరాకు టెండరింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మరోమారు రీటెండరింగ్ నిర్వహించాం. ప్రస్తుతం నలుగురు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. జిల్లావ్యాప్తంగా 1.60 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 60 లక్షలు అందించాం. జనవరి 10 లోగా లక్ష్యం మేర పంపిణీ చేస్తాం. నీరు సమృద్ధిగా ఉన్న చెరువులు, కుంటలు గుర్తించి సొసైటీల అభ్యర్థన మేరకు చేప పిల్లలు వదులుతాం.
– డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ
అమరచింత: జిల్లాలో వారం రోజులుగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుండగా.. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి చేప పిల్లలు చేరనున్నాయని మత్స్యకారులు సంబురపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1.60 లక్షల చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. ఇప్పటి వరకు 60 లక్షలు పంపిణీ చేశారు. ఈ నెల 10లోగా పంపిణీ పూర్తి చేస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. వారం వ్యవధిలో రీటెండర్ ప్రక్రియ పూర్తిచేసి సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా కేటాయించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఉచిత చేప పిల్లలు వదిలేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇది వరకే సొసైటీల్లో నిల్వ ఉన్న డబ్బులతో మత్స్యకారులు చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో వదులుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ చేప పిల్లలు సైతం వదిలితే మరింత లాభం చేకూరనుందని సంబురపడుతున్నారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే పెరుగుదల నిలిచి బరువు తగ్గుతాయనే సందేహాలను సైతం వ్యక్తమవుతున్నాయి. గతేడాది 1.50 కోట్ల చేప పిల్లలను అందించాలనే లక్ష్యం ఉన్నా అనుకున్న మేర నిధులు మంజూరు కాకపోవడంతో కేవలం 54.84 లక్షలు మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేయగలిగారు. ప్రస్తుత సంవత్సరం 1.60 కోట్ల మేర ఉచిత చేప పిల్లలను అందించేందుకు సిద్ధమయ్యారు.
నీరున్న చెరువులకే ప్రాధాన్యం..
ప్రస్తుతం రాయితీ చేప పిల్లలను ఆయా గ్రామాల్లోని మత్స్యకార సొసైటీల విన్నపం మేరకు చేప పిల్లలను అందించనున్నారు. చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉంటేనే రాయితీ చేప పిల్లలు అందిస్తామని మత్స్యశాఖ ఏడీ వెల్లడించారు. వానాకాలం ప్రారంభంలో నీటితో నిండి ఉంటాయని.. ప్రస్తుతం కాస్తా తగ్గుముఖం పట్టడంతో ఎదుగుదల ఉండదని, దీంతో నీరు సమృద్ధిగా ఉన్న చెరువులను గుర్తించి చేప పిల్లలను అందిస్తున్నామని చెబుతున్నారు.
మత్స్య సహకార
సంఘాలు 143
మత్స్యకారులు 13,600
గతేడాది పంపిణీ చేసిన
చేప పిల్లలు 54.84 లక్షలు
మత్స్యబీజ సంబురం
మత్స్యబీజ సంబురం
మత్స్యబీజ సంబురం
మత్స్యబీజ సంబురం
మత్స్యబీజ సంబురం


