‘రైతుభరోసా’ అందేనా..?
జిల్లాలో ఆరంభమైన
యాసంగి సాగు
● పెరిగిన పెట్టుబడులు..
తగ్గిన దిగుబడులు
● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు
మదనాపురం: జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగు చేయనుండగా.. కొన్నిచోట్ల రైతులు నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుభరోసా కోసం కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించడంతో రైతులు అయోమయంలో ఉన్నారు.
సాగు భూములకే..
కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.10 వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని రైతులకు హామీ ఇచ్చింది. ఈ మేరకు మొదట యాసంగి సీజన్‌లో రైతు భరోసా పథకాన్ని పాతపద్ధతిలోనే అమలు చేసి తర్వాత వానాకాలంలో ఎకరాకు రూ.6 వేల చొ ప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. గుట ్టలు, రహదారులు, వెంచర్లు తదితర సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసాను నిలిపివేసింది.
వానాకాలంలో అధిక వర్షాలు, యూరియా కొరతతో జిల్లాలో సాగుచేసిన పంటలు సరైన దిగుబడి రాక రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా అందడం లేదు. చివరకు పంటలకు కనీస మద్దతు ధరలు కూడా లేకపోవడంతో అప్పులతో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడికి చేసిన అప్పు తీరకపోవడంతో ఆర్థికంగా కుదేలయ్యారు. యాసంగి సాగుకై నా వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందించాలని కోరుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో సుమారు 1.75 లక్షల మంది రైతులు రైతుభరోసా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వానాకాలంలో సుమారు రూ.205 కోట్ల నిధులు విడుదల కాగా.. యాసంగి సాగుకు రూపాయి కూడా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఏడాదికి రెండుసార్లు పంటసాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. యాసంగిలో పంటలు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నామని వాపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులను సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6 వేలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. పండుగ ముగిసిన వెంటనే నిధులు జమయ్యే అవకాశం ఉంది.
– దామోదర్,
ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి
‘రైతుభరోసా’ అందేనా..?
‘రైతుభరోసా’ అందేనా..?


