క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యం
వనపర్తిటౌన్: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ఎంతో ముఖ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన రామన్ ఐఐటీ టాలెంట్ టెస్ట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ లేకుండా ఎంత చదువు చదివినా ఉపయోగం ఉండదని తెలిపారు. కేవలం కలలుగని కూర్చుంటే విజయం వరించదని.. సాకారానికి అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. రానున్న తరానికి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం, విద్య అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని, కన్న నేలకు సేవలందించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం మరవొద్దని కోరారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ప్రజా వైద్యశాల డైరెక్టర్ డా. మురళీధర్, సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నతస్థాయికి ఎదుగుతారని, చదువు, ఆటలు, పాటలు ఏ రంగంపై ఆసక్తి ఉంటే వాటినే ఎంచుకొని సత్తా చూపాలని కోరారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ఆశయాలకు అనుగుణంగా దారి చూపాలన్నారు. అనంతరం విజేతలకు చిన్నారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రతినిధి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కళావేదిక సభ్యులు, కవులు, ప్రజా ప్రతినిధులు రాములు, బైరోజు చంద్రశేఖర్, సత్తార్, గంధం నాగరాజు, రమాదేవి, ప్రవీణ్, భాస్కర్, రాజేంద్రప్రసాద్‌చారి, మద్దిలేటి, షఫీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


