నిర్వాహకులు నిర్లక్ష్యం వీడాలి : డీఆర్డీఓ
వీపనగండ్ల: వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం వీడి బాధ్యతాయుతంగా పని చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి హెచ్చరించారు. శనివారం మండలంలోని కల్వరాలలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని.. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, వీఓఏలు, మహిళా సంఘం సభ్యులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆమె వెంట సర్పంచ్ బండారు రాములు, ఏపీఎం మద్దిలేటి, వీఓఏలు నాగయ్య, ప్రసాద్, పలువురు రైతులు, గ్రామస్తులు ఉన్నారు.


