విధేయులకే కార్యవర్గంలో చోటు
వనపర్తి: డీసీసీ కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఇప్పటి వరకు ఉన్న జిల్లా, నియోజకవర్గ, మండల కార్యవర్గాలన్నీ రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మత్స కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకుడు మెట్టు సాయికుమార్ తెలిపారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులతో కలిసి మాట్లాడారు. త్వరలో అత్యవసర సమావేశం నిర్వహించి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి సమక్షంలో స్క్రీనింగ్ చేసి జిల్లా, మండల, గ్రామ కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ విధేయులు, పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి, అక్రమ కేసులతో ఇబ్బందులు పడిన వారి తర్వాతే మిగతా వారిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని.. పైరవీలకు ఎలాంటి ఆస్కారం లేకుండా పార్టీ బలోపేతం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కార్యవర్గాల ఎన్నిక ఉంటుందని వివరించారు. పార్టీ ఎస్సీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పని చేస్తుందని.. స్వ లాభాలు ఆశించదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, పీసీసీ డేలిగేట్ శంకర్‌ప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మహిళా నాయకురాలు ధనలక్ష్మి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల చంద్రమౌళి, నాయకులు పసుపుల తిరుపతయ్య, నాయకులు కదిరె రాములు, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, బి.కృష్ణ, బాబా, దివాకర్, గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ చైర్మన్,
కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకుడు
మెట్టు సాయికుమార్


