ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
కొత్తకోట/కొత్తకోట రూరల్: నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థ పాలన అందించాలని, గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని, అందుకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో కొత్తకోట, మదనాపురం మండలాల్లో కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వారిని శాలువాలతో సన్మానించి మాట్లాడారు. పాలమూరు జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం తర్వాత దేవరకద్రలో అత్యధిక సంఖ్యలో పార్టీ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పుర ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితాలు పునరావృతం అవుతాయని, రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీ చేసి ఓడిన సర్పంచులు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించి తిప్పికొట్టాలన్నారు. రానున్న ఏప్రిల్ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ఎల్–1, ఎల్–2 అర్హత పొందిన 37 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
కొత్తకోట పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం పుర కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా సంతబజార్ అభివృద్ధి, పురపాలక భవనం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, ఆడిటోరియం, బస్తీ దవాఖానా ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమన్వయంతో పనిచేస్తూ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, ఎన్‌జే బోయేజ్, శ్రీనివాస్‌రెడ్డి, రావుల కరుణాకర్‌రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, డా. పీజే బాబు, నరేందర్‌రెడ్డి, పెంటన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.


