నీటి సరఫరాలో అంతరాయం కలిగితే చర్యలు
అమరచింత: వేసవిలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోనని, సిబ్బందిపై చర్యలు తప్పవని మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌ను ఆయన సందర్శించారు. శనివారం తాగునీరు అందడం లేదని ప్రజలు రోడెక్కి రాస్తారోకో చేయడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. శుక్రవారం గోపాల్‌పేట మండలంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి అదేరోజు రాత్రి నీటి సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని.. అలాంటిది అమరచింత పురపాలికలో ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ, పుర వాటర్‌మెన్‌ల మధ్య సమన్వయం లేకనే నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని.. ఇకపై నీటి సరఫరాలో అంతరాయం కలిగితే సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. రోజువారీగా ఎన్ని లీటర్ల నీటిని అందిస్తున్నారనే విషయంతో పాటు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండిన తర్వాతే మున్సిపల్ వాటర్ లైన్‌మెన్‌లకు అప్పగించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ సిబ్బందిపై ఉందని వివరించారు. ఆయన వెంట ఏఈతో పాటు సిబ్బంది ఉన్నారు.


