అమరచింత: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చిన్న వయస్సులో ఆడ పిల్లలకు వివాహాలు చేయడంతో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి కుటుంబంతో ఎన్నో లాభాలు, సంతోషాలు ఉంటాయని.. చిన్న చిన్న తగాదాలతో భార్యాభర్తలు, అన్నదమ్ముళ్లు విడిపోరాదని సూచించారు. అలాగే బాలకార్మిక వ్యవస్థ, సైబర్ క్రైం, మోటారు వెహికిల్ తదితర చట్టాల గురించి వివరించారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రజని మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలు, బాలికలు, వృద్ధులకు సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని.. హెల్ప్‌లైన్ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి.రజని, సీనియర్ సివిల్‌కోర్టు న్యాయమూర్తి కవిత, జూనియర్ సివిల్ న్యాయమూర్తి వై.జానకి, గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు.