ప్రారంభమైన పది పరీక్షలు
సాక్షి నెట్‌వర్క్: జిల్లాలో శుక్రవారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 36 కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటిరోజు 6,853 మంది విద్యార్థులకుగాను 6,842 మంది హాజరుకాగా 11 మంది గైర్హాజరైనట్లు డీఈఓ అబ్దుల్ ఘనీ తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. పరిసరాల్లోని అన్ని జిరాక్స్ కేంద్రాలను పరీక్ష సమయంలో అధికారులు మూసివేయించారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సీఐ కృష్ణ, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ బందోబస్తు నిర్వహించారు.
కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అధికారులు..
పదోతరగతి విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ బందోబస్తు, ప్రాథమిక తాత్కాలిక వైద్య కేంద్రం, తాగునీరు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. ప్రశ్నాపత్రాలు తెరిచే సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటును చూశారు. పరీక్ష కేంద్రాల్లోకి ఏ ఒక్కరికీ సెల్‌ఫోన్ అనుమతి లేదని.. ఎవరైనాసరే కేంద్రం బయటే ఉంచి రావాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈఓ మహ్మద్ అబ్దుల్ ఘని, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి ఉన్నారు.
● చిన్నంబావి మండలం పెద్దదగడ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
● జిల్లాకేంద్రంలోని సరస్వతి శిశుమందిర్, హరిజనవాడ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు.బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ వెంట సీఐ కృష్ణ, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ ఉన్నారు.
మొదటిరోజు
11 మంది విద్యార్థులు గైర్హాజరు
ప్రారంభమైన పది పరీక్షలు
ప్రారంభమైన పది పరీక్షలు


