గోపాల్‌పేట: డా. మాధవరెడ్డి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో న్యూరోసర్జన్‌గా పనిచేస్తూనే జిల్లా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించారని.. ఆయన సేవలు మరువలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కొనియాడారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లెల మాధవరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి ఉచితంగా వైద్యసేవలు పొందిన ఎందరో పేదలు ఆయనను నేటికీ మర్చిపోలేదని గుర్తుచేశారు. మాధవరెడ్డి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల వనపర్తిలో జరిగిన సభలో ఖాసీంనగర్ ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టారని.. సంతోషించదగిన విషయమన్నారు. ఇదిలా ఉండగా వైద్య శిబిరంలో మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రి నుంచి కంటి, పంటి, కీళ్ల నొప్పులకు సంబంధించిన వైద్యులు, నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నుంచి పది మంది వైద్యులు, సిబ్బంది వచ్చి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే హైదరాబాద్ గ్రేస్ క్యాన్సర్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది క్యాన్సర్ నిర్ధారణ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల, పెద్దమందడి, వనపర్తి రూరల్ తదితర ప్రాంతాల నుంచి సుమారు ఆరు వేల మందికి పైగా రోగులు వచ్చిన వైద్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య శిభిరానికి వచ్చిన ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించారు. గ్రామాల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించడంతో పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అడిగిన వెంటనే ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించిన డాక్టర్లు, సిబ్బందికి డా. చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు జిల్లెల ఆదిత్యారెడ్డి, పరావస్తు ఫౌండేషన్ ఫౌండర్ మధుకర్‌స్వామి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


