
ఏఐ ఆధారిత బోధన కేంద్రం ప్రారంభం
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మనిగిళ్ల ప్రాథమిక పాఠశాలలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్) ఆధారిత బోధన కేంద్రాన్ని శనివారం జిల్లా మానిటరింగ్ అధికారి మహానంది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు, నాలుగు, ఐదోతరగతి విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, గణిత సామర్థ్యాల మీద పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏఐ విద్య ఉపయోగపడుతుందని వివరించారు. జిల్లాలోని 11 పాఠశాలలు ఎంపికకాగా.. అందులో మనిగిళ్ల పాఠశాల ఉందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాణం విష్ణు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శాంతన్న, స్థానిక ప్రజాప్రతినిధులు తిరుపతిరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌సాగర్, సురేష్, పల్లవి, హెచ్‌ఎం వెంకటేష్, రాముడు, లావణ్య, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
113 మంది
విద్యార్థులు గైర్హాజరు
కొత్తకోట రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంతో పాటు కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నివేదిత జూనియర్ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. 4,917 మంది విద్యార్థులకుగాను 4,804 మంది హాజరయ్యారని.. 113 మంది గైర్హాజరైనట్లు వివరించారు.
డీఎంహెచ్‌ఓ
ఆకస్మిక తనిఖీ
పెబ్బేరు రూరల్: మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం జిల్లా వైద్యాధికారి డా. అల్లె శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలను పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలోని నాలుగు ప్రైవేట్ వైద్యశాలలు, మూడు ల్యాబ్‌లు, 12 ప్రథమ చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేశామని చెప్పారు. స్థాయికి మించిన వైద్యం చేయరాదని ఆర్‌ఎంపీలు, పీఎంపీలను హెచ్చరించినట్లు వివరించారు. త్వరలోనే మండలంలోని అన్నిగ్రామాల్లో ఉన్న కేంద్రాలను తనిఖీలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బండారు శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్ ఉన్నారు.
రామన్‌పాడులో 1,017 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం 1,017 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 69 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 131 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.

ఏఐ ఆధారిత బోధన కేంద్రం ప్రారంభం

ఏఐ ఆధారిత బోధన కేంద్రం ప్రారంభం