పార్టీ విధేయులకు తగిన ప్రాధాన్యం
వనపర్తి: పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికై నా సముచిత స్థానం, ప్రాధాన్యం దక్కుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ చాలా బలంగా ఉందని.. పార్టీ కన్నతల్లి లాంటిదని శ్రేణులు గుర్తించాలని కోరారు. చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటూ.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలను సంయుక్తంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారని గుర్తు చేశారు. ఉనికి కోల్పోతున్నామనే బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి తోలు తీస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చి తిరిగి అక్కడికే చేరుకున్నారని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్ తోలు తీశారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను త్వరలో ఎత్తివేస్తామని క్యాడర్‌లో ధైర్యాన్ని నింపారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ప్రభుత్వానికి రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. రాబోయేది కూడా కాంగ్రెస్ హయాంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. వలసల పాలమూరు అభివృద్ధికి ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే.. రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ కలిసి ఉండేందుకు నాలుగు మెట్లు దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన లోపాలను గుర్తించేందుకు కమిటీ వేయాలని.. నిజాలను వెలికితీసి భవిష్యత్‌లో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుందామన్నారు. పాత.. కొత్త అనే తేడాలు లేకుండా ఒక్కటే అన్న పేరును తీసుకొద్దామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ ముగిసిన తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి డీసీసీ అధ్యక్షుడిని సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూతన కార్యాలయంలో పూజలు చేశారు.
పని చేయకుంటే పక్కనబెట్టుడే..
పార్టీ పదవులు పొంది పని చేయకుండా సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైతే పక్కన పెడతామని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు సిఫారస్ చేసినా ఉపేక్షించేది లేదని డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొత్తకాపు శివసేనారెడ్డి తెలిపారు. పార్టీ బాగుంటేనే పదవులు పొంది ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. అత్యాధునిక హంగులతో జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేస్తామని, మనస్పర్థలను చర్చలతో రూపుమాపి ఎదురులేని శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులు సంధ్య, మల్లయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శంకర్‌ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్‌గౌడ్, ధనలక్ష్మి, యాదగిరి, బాబా తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడి పదవీ బాధ్యతల
స్వీకారంలో మంత్రులు జూపల్లి
కృష్ణారావు, వాకిటి శ్రీహరి


