‘మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం’
అమరచింత: పూటకో పార్టీ మార్చిన మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడంగల్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో ధూషించడం, అవహేళన చేస్తూ నోటి దురుసును ప్రదర్శించడం సరికాదన్నారు. పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడితే ఎందుకంత కడుపుమంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో వచ్చిన రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు కాంగ్రెస్ వారు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ముదిరాజ్ బిడ్డ అని చెప్పుకొనే మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ చెరువుల్లో 12 లక్షల చేప పిల్లలు వదిలానని.. ప్రస్తుత మంత్రి కేవలం 2 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసిన విషయం మత్స్యకారులకు తెలుసని చెప్పారు. గతంలో బీజేపీ, బీఆర్‌ఎస్, ప్రజారాజ్యం పార్టీలో చేరిన మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాదని.. తమ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుతో బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకొన్నది నిజం కాదా అంటూ ఫొటోను చూపించారు. జూరాలకు సమృద్ధిగా వరద వస్తే రెండో పంటకు క్రాప్ హాలీడే ప్రకటించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, క్రాప్ హాలిడే విషయాన్ని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. జూరాల ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షులు రవికుమార్ యాదవ్, రమేష్ ముదిరాజ్, బీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్‌ఏ రాజు, మస్తీపురం సర్పంచ్ సాంబశివుడు, మాజీ వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, జింక రవి తదితరులు పాల్గొన్నారు.


