భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు గురువారం క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాలోని చర్చిల్లో క్రైస్తవుల ప్రార్థనలు, గీతాలతో మార్మోగాయి. జిల్లాకేంద్రంలోని ఒలివా ఎంబీ చర్చిలో జరిగిన వేడుకలకు శంషాబాద్‌కు చెందిన ప్రముఖ దైవ ప్రసంగీకుడు డా. జయకర్ హాజరై సందేశమిచ్చారు. సర్వమానవాళిపై ప్రేమ, కరుణ, క్షమాగుణం కలిగి ఉండాలని యేసు ఆచరణలో చూపారని, అలాంటి దేవుడిపై విశ్వాసంతో జీవించాలని కోరారు. సర్వ మానవాళి క్షేమానికి ప్రార్థఽనలు చేశారు. అదేవిధంగా మిగతా చర్చిల్లో కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో కల్వరి టౌన్ చర్చి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా న్యూయోరిషలేమ్ గాస్‌పాల్, బేతస్థ ప్రార్థన మందిరిం, హెబ్రోన్, సీయోనుకొండ, క్రీస్తు సాక్షుల సవాస మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో కల్వరి టౌన్ చర్చి నిర్వాహకులు గంధం రంగస్వామి, డి.యాకోబు, పరంజ్యోతి, ఎంబీ వోలీవా చర్చి పాస్టర్ జానప్ప, కల్వరి టౌన్ చర్చి పాస్టర్ జాన్‌రాజ్, వోలీవా చర్చి చైర్మన్ సుకన్య, యేసయ్య, రోనాల్డ్, కోశాధికారి అమృత సాగర్, సభ్యులు విద్యాసాగర్, కళానందం, పీడీ కమలమ్మ, వనజాశ్రీ, ఎర్నాల్డ్, స్వామిదాస్, జయనందం తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు, నాటికలు..
జిల్లాకేంద్రంలోని పలు చర్చిల్లో బుధవారం రాత్రి చిన్నారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏసు పుట్టుక, ఇతివృత్తం తెలిపే నాటికలు, ఏసు ప్రభువు ప్రజలపై చూపే జాలి, కరుణ, దయ, క్షమాగుణాలు తెలియజేసే పలు నాటికలు అధ్యంతం అలరించాయి.


