
వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు
వనపర్తి: జిల్లాలో సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో క్షయ, మధుమేహం, వడదెబ్బ తదితర అంశాలపై వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిషన్ మధుమేహలో భాగంగా 40 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయాలన్నారు. ఇప్పటి వరకు 70 శాతం పూర్తయిందని.. ఈ నెల 25లోపు లక్ష్యం చేరుకోవాలని సూచించారు. మధుమేహం బారిన పడకుండా ఉండటానికి, వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా వాల్‌పోస్టర్లతో ప్రచారం చేయాలన్నారు. క్షయ అనుమానితులను గుర్తించి వందశాతం వైద్య పరీక్షలు చేయాలని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని ఆదేశించారు. ఇప్పటి వరకు 99 శాతం పూర్తయిందని.. మిగిలిన ఒక శాతం త్వరలోనే పూర్తి చేస్తామని ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి తెలిపారు. తెమడ పరీక్షతో పాటు ఎక్సరే తీసి క్షయ నిర్ధారణ పకడ్బందీగా చేయాలని సూచించారు.
మందులు అందుబాటులో ఉంచాలి..
వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి పని ప్రదేశాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, క్షయ ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డా. రామచందర్‌రావు, డా. పరిమళ, బాసిత్ తదితరులు పాల్గొన్నారు.
సహజ రంగులతో
హోలీ జరుపుకోవాలి
జిల్లా ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని సహజ రంగులను వినియోగించి ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ హోలీ పండుగ జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే పండుగ జరుపుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సున్నిత ప్రదేశాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, గుర్తు తెలియని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం నిషేధించామని వివరించారు. గుంపులుగా తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు