వనపర్తి/కొత్తకోట రూరల్: జిల్లాలో పంట వివరాల నమోదు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో రైతు నాగరాజు పొలం వద్ద పంట వివరాల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఏ రకం వరి వేశారు.. పంట సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందా.. సరైన నీటి వనరులు ఉన్నాయా అనే వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఎరువులు ఎక్కడ కొంటున్నారు?.. ట్రేడర్లు నాణ్యమైన మందులు, విత్తనాలు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రైతులు సాగు చేసిన పంటకు సంబంధించి అన్ని వివరాలు పక్కాగా నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
నిర్మాణాల్లో వేగం పెంచాలి..
జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కొత్తకోట, పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కొత్తకోట పాఠశాలలో సీబీఎఫ్ నిధులతో చేపడుతున్న ఆరు అదనపు తరగతి గదులు, బాలికల పాఠశాలలో డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మిస్తున్న రెండు తరగతి గదుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా కంచిరావుపల్లి పాఠశాలలోని రెండు మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా నెలాఖరులోగా పూర్తి కావాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, కొత్తకోట, పెబ్బేరు తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, లక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈలు నరేష్, కార్తీక్, ఇతర అధికారులు ఉన్నారు.


