మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి
వనపర్తి: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో శనివారం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ప్రస్తుత రోజు ల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా.. విద్య, వైద్యం, పారిశ్రామిక, అంతరిక్షం ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమన్నారు. మహిళా అధికారులు తమ వృత్తిపరమైన బాధ్యతలను ధైర్యంగా నిర్వర్తించాలని సూచించారు. మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాలు, విధుల్లో సమానంగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఉన్నతంగా ఆలోచించే మహిళలకు తమ కుటుంబాలను ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉంటుందన్నారు. ప్రత్యేకంగా పోలీసు శాఖలో ఎస్‌ఐ నుంచి హోంగార్డు వరకు మహిళా అధికారులు శాంతి భద్రతల విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అదే విధంగా విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఎస్పీ పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను శాలువాలతో సత్కరించారు. ముందుగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాల్లో డీసీఆర్‌బీ ఇన్‌చార్జి అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వు సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, షీటీం ఎస్‌ఐ అంజద్, శిక్షణ ఎస్‌ఐలు హిమబిందు, దివ్యశ్రీ, భరోసా సెంటర్ కోఆర్డినేటర్, శిరీష, విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తిరుపతయ్య, యాదగిరి, బ్రహ్మాచారి, బైరోజు చంద్రశేఖర్, సూర్యనారాయణ, గణేశ్, నరసింహ, భాస్క ర్, రవి, గిరిరాజాచారి, అలివేలమ్మ, జ్యోతి, కల్పన, సుకన్య, సువర్ణదేవి తదితరులు పాల్గొన్నారు.


