పాలమూరుకు అన్యాయం చేయం
వనపర్తిటౌన్: పాలమూరుకు అన్యాయం జరిగితే తట్టుకోలేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీరు తీసుకుపోవడాన్ని మంత్రి మండలి సమావేశంలో తాను విభేదించినట్లు చెప్పారు. 6, 7 టీఎంసీలు నిల్వ ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా వట్టెం నుంచి రెండు ప్రాంతాల్లో లిఫ్ట్ చేస్తే కేవలం రూ. 200 కోట్లతో డిండికి నీరు తీసుకెళ్లవచ్చని సూచించినట్లు వెల్లడించారు. కొన్ని శాఖల అధికారులు, గత ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 62కోట్లతో కొత్తగా మంజూరు చేసిన కాశీంనగర్ ఎత్తిపోతల పథకంతో అంజనగిరి, దత్తాయిపల్లి, జయన్న తిర్మలాపూర్, అప్పాయిపల్లి, కాశీంనగర్‌తో పాటు 19 తండాల్లో 4వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. డీ– 8 కాల్వ నుంచి గ్రావిటీ ద్వారా రామన్నగట్టు రిజర్వాయర్‌లో నీరు నిల్వచేసి, లిఫ్ట్ ద్వారా ప్రతిపాదిత ప్రాంతాలకు సాగునీరు అందుతాయన్నారు. వనపర్తి వాసులకే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు స్థానికంగా, హైదరాబాద్ వేదికగా వైద్యసేవలు అందించిన డాక్టర్ మాధవరెడ్డి విగ్రహాన్ని వనపర్తిలో ఏర్పాటు చేయడంతో పాటు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఆయన పేరు పెడతామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ముందుకు సాగారని.. ఆ తర్వాత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో విపత్కర సమస్య ఉత్పన్నమైందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు ఖమర్, కోట్ల రవి, బాబా, సహదేవ్, కోళ్ల వెంకటేష్, యాదయ్య, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పెంటన్న, సమద్, జాన్ తదితరులు ఉన్నారు.


