విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది. గడిచిన రెండు రోజులుగా వీచిన ఈదురుగాలులతో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ వైర్లపై చెట్లు పడడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు పాడైపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయనగరం జిల్లా కేంద్రంలో అదే తరహా పరిస్థితి నెలకొనడంతో గురువారం ఉదయం సరఫరాను పునరుద్ధరించారు. వాయుగుండం ప్రభావంతో విద్యుత్ శాఖకు రూ.10.25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని విజయనగరం, ఎస్.కోట, గంట్యాడ, జామి, గజపతినగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదాం, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, బొబ్బిలి, మెంటాడ తదితర ప్రాంతాలలో ఈదురుగాలుతో కూడిన వర్షాలతో తాటి, సరుగుడు వంటి చెట్లు పడిపోవడం, చెట్ల కొమ్మలు విరగడం కారణంగా సుమారు 129 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 31 ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి. ఒక్కో స్తంభానికి రూ.5వేలు, ట్రాన్స్‌ఫార్మర్ మార్చేందుకు రూ.15వేలు చొప్పున ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా 33కేవీ, 11కేవీ లైన్‌లలో మొత్తం 499 ఫీడర్లకు గాను 56 ఫీడర్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒరిగిన విద్యుత్ స్తంభాలు, పాడైన ట్రాన్స్‌ఫార్మర్‌లు మార్పు చేసేందుకు 863 మంది కాంట్రాక్ట్ సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు నిమగ్నమయ్యారు.
వాయుగుండం ఎఫెక్ట్‌తో రూ.10.25 లక్షల నష్టం
ఈదురుగాలులతో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న విద్యుత శాఖ
విజయనగరం, బొబ్బిలి కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
మంచినీటికి ఇబ్బందులు
ఇదిలా ఉండగా సుమారు 24 గంటల పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంచి నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో బోరుబావులను ఆశ్రయించారు. గురువారం సాయంత్రానికి అన్ని ప్రాంతాలకు సరఫరాను పునరుద్ధరిస్తామని, వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సంబంధించి సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎక్కడ అయినా విద్యుత్ స్తంభాలు పడిపోయినా, తీగలు తెగి పడి ఉన్నా , ఎటువంటి సరఫరా అంతరాయాలు ఏర్పడినా లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే సెంట్రల్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1912కి గానీ విజయనగరం సర్కిల్ కార్యాలయంలో గల కంట్రోల్ రూమ్ నంబర్లు 9490610102, 9490610103కు బొబ్బిలి డివిజన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9490610123ను సంప్రదించి విద్యుత్ అంతరాయంలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఎస్‌ఈ లక్ష్మణరావు కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ వినియోగదారులను కోరారు.


