● 25 ఏళ్లుగా భర్తకు దూరంగా..
కూలి పనులతో జీవనం
● దరఖాస్తుల గడువు ముగియడంతో
బాధితురాలి ఆవేదన
నెల్లిమర్ల రూరల్: భర్తకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్న తనకు పింఛన్ మంజూరు చేయాలని నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామానికి చెందిన 54 ఏళ్ల కల్లూరి లక్ష్మి కోరుతోంది. నిబంధనల పేరుతో ఎదురవుతున్న సమస్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. సుమారు 25 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నప్పటికీ, కోర్టు నుంచి విడాకుల ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతో పింఛన్ దరఖాస్తు తిరస్కరణకు గురైందని వాపోయింది. ప్రస్తుతం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు పింఛన్ ఒక్కటే ఆసరాగా ఉంటుందని ఆశపడ్డానని తెలిపింది. సుమారు 25 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో భర్తతో ఆమె విడిపోయింది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. తల్లిదండ్రులు కూడా 2023లో మృతి చెందడంతో ప్రస్తుతం ఆమెకు అండగా ఎవరూ లేరు. వయస్సు పెరుగుతున్న కొద్దీ కూలి పనులు చేయడం కష్టంగా మారుతోందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే పింఛన్ తనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. పింఛన్ దరఖాస్తులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా పూర్తయిందని, అయినప్పటికీ తనలాంటి అర్హుల సమస్యలను అధికారులు మానవీయ కోణంలో పరిశీలించాలని ఆమె కోరుతోంది. ఈ సమస్యపై ఇప్పటికే తహసీల్దార్‌ను ఆశ్రయించడంతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలోనూ ఫిర్యాదు చేసినట్లు లక్ష్మి తెలిపింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయింది.


