కొత్త కనెక్షన్‌ లేనట్టేనా? | - | Sakshi
Sakshi News home page

కొత్త కనెక్షన్‌ లేనట్టేనా?

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

రామభద్రపురం: గ్యాస్‌ కనెక్షన్‌ కొత్తది కావాలంటే చుక్కలు లెక్కపెట్టాల్సిందే. కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిందే. అప్పటికీ కొత్త కనెక్షన్‌ మంజూరు కాదు. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావంతో నిలిపివేసిన కనెక్షన్ల మంజూరు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పరిస్థితులు చక్కబడినా గ్యాస్‌ కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. ఇది వేలాది మంది వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం చాలా మంది అర్హులకు ఉత్తుత్తిదిగానే మార్చేసింది. కనీసం కొత్త కనెక్షన్లు, అదనపు సిలిండర్లు ఇవ్వకపోవడం వినియోగదారుల్లో ఆవేదన నింపుతోంది. ప్రభుత్వం కొత్త కనెక్షన్ల మంజూరుకు ఇక మంగళం పాడినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో వివిధ గ్యాస్‌ ఏజెన్సీలు 36 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో దీపం కనెక్షన్లు 1,85,254, సీఎస్‌ఆర్‌ కనెక్షన్లు 43,287, ఉజ్వల కనెక్షన్లు 1,29,277, జనరల్‌ కనెక్షన్లు 3,46,455 కలిసి 7,04,273 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి గ్యాస్‌ సరఫరా అవుతుంది. ఇందులో 5,02,634 కనెక్షన్లకు ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున ఉచితంగా ఇస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, వేలాది మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ అందని ద్రాక్షగానే మారింది. మరోవైపు కొత్త గ్యాస్‌ కనెక్షన్ల కోసం, రెండో సిలిండర్‌ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్‌ ఏజెన్సీలకు సైతం ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కొత్త కనెక్షన్ల కోసం వచ్చేవారికి సమాధానం చెప్పలేకపోతున్నారు.

రామభద్రపురంలో వ్యాన్‌తో గ్యాస్‌ సిలిండర్ల సరఫరా

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

కొత్తగ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో కొత్త కనెక్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యాపారాలకు అవసరమైన వారికి కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తున్నాం. అత్యవసరమైన వారికి రాయితీ లేకుండా 5 కిలోల గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నాం.

– మురళీనాథ్‌, డీఎస్‌ఓ, విజయనగరం

మంజూరు కాని గ్యాస్‌ కనెక్షన్లు

కొత్త కనెక్షన్ల కోసం వేలాది మంది ఎదురుచూపు

పట్టించుకోని ప్రభుత్వం

ఉచితగ్యాస్‌ను ఉత్తుత్తిగా మార్చేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement