పైడితల్లికి పూజలు | - | Sakshi
Sakshi News home page

పైడితల్లికి పూజలు

Sep 20 2026 12:15 AM | Updated on Sep 20 2026 12:15 AM

విజయనగరం క్రైమ్‌: మూలా నక్షత్రం సందర్భంగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయాల్లో శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అటు మూడులాంతర్లు దగ్గరున్న చదురగుడిలోను రైల్వే స్టేషన్‌ దగ్గరున్న వనంగుడిలో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు పూజలు చేశారు. వనంగుడిలో మూలా నక్షత్రం సందర్భంగా చండీ హోమం జరిగింది. ఆలయ అర్చకులు కృష్ణస్వామి, తాతారావులు భక్తులతో చండీహోమం నిర్వహించారు.

కుక్కకాటుతో ముగ్గురికి గాయాలు

భామిని: మండలంలో కుక్కల స్వైర విహారం పెరుగుతూ దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం భామిని మండలం బిల్లుమడ కాలనీలో ముగ్గురిని కుక్క కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. కుప్పిలి యశోద. పిలకా సీతమ్మ, విద్యార్థి అర్లి జగన్‌లు గాయపడడంతో తీవ్ర గాయాల పాలైన కుప్పిలి యశోదను భామిని పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవల అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.మిగతా ఇద్దరు భామిని సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్నారు.

పశువులు తరలిస్తున్న

రెండు బొలెరోలు సీజ్‌

ఎనిమిది పశువులు స్వాధీనం

కురుపాం: మండలంలోని నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న చర్చి ఎదురుగా పశువులు అక్రమంగా తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలు సీజ్‌ చేసినట్లు నీలకంఠాపురం ఎస్సై పి.రమేష్‌నాయుడు తెలిపారు. శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బొలెరో వాహనాల్లో 8 పశువులను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారి వద్ద ఎటువంటి అనుమతులు లేనందున వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని జాబుగూడ గ్రామ శివారులో సారా తయారీ కోసం డ్రమ్ముల్లో పులియబెట్టిన సుమారు 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎల్విన్‌పేట ఎస్సై బి.శివప్రసాద్‌ శనివారం తెలిపారు. జాబుగూడ పరిసరాల్లో సారా తయారు చేస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా బెల్లపు ఊటను గుర్తించి ఆ ప్రదేశం వద్ద సారా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే 20 లీటర్ల సారాను గుర్తించి సీజ్‌ చేసినట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఆయన వెంట పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

యువకుడిపై

పొక్సో కేసు నమోదు

సంతకవిటి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు ఎస్పై ఆర్‌.గోపాలరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధిత బాలిక వంగర మండలంలోని మడ్డువలస గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఇటీవల రాఖీ పండగకు ఇంటికి వచ్చిన బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతం చేసినట్లు అమ్మాయి తల్లి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement