వీరఘట్టం: అప్పటివరకు ఇంట్లో అందరితో కబుర్లు చెప్పిన యువకుడు మిత్రులతో కలిసి వీధిలోకి వెళ్లాడు. అంతలో కరెంట్ తీగ రూపంలో ఆ యువకుడిని మృత్యువు కబంళించింది. వీరఘట్టం మండలంలోని చిదిమి గ్రామంలో శనివారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుర్రు సాయి(24), చంద్రయ్య, ముచ్చు కామేష్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా వీధి గుండా వెళ్తున్న 11కెవీ విద్యుత్ లైన్‌లో ఒక వైరు తెగిపడింది. ఆ ముగ్గురిలో చంద్రయ్య,కామేష్‌లు షాక్ తగిలి దూరంగా పడిపోయారు. అయితే సాయి మాత్రం అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంటి నుంచి వెళ్లిన కొడుకు అంతలోనే చనిపోయాడని తెలియడంతో తల్లిదండ్రులు గంగులు, గంగమ్మలు భోరున విలపించారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కుమారుడిని ఆ దేవుడు పగబట్టి చంపేశాడంటూ రోదించారు. గొర్రెలు కాస్తూ ఇంటిని పోషిస్తున్న సాయి మృతి చెందడంతో ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా పోయిందని ఎంపీపీ దమలపాటి వెంకటరమణ అన్నారు.ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం ఏఈ సోమేశ్వరరావు, ఎస్‌ఈ షణ్ముఖరావులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
చికిత్స పొందుతూ మహిళ..
నెల్లిమర్ల: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన బందపు లక్ష్మి(51) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 14న వినాయకచవితిరోజున వినాయక పూజ చేసి సాయంత్రం వినాయకప్రతిమను స్థానిక చంపావతి నదిలో నిమజ్జనం చేసి తిరిగి కొత్తపేట వస్తుండగా నెల్లిమర్ల నుంచి అలుగోలు వెళ్తున్న పొందూరు హరిబాబు స్థానిక సువ్వాని పేట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని వెంటనే విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి శనివారం మృతిచెందింది. ఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.


