● పొలం పనికి వెళ్లివస్తుండగా పిడుగుల వాన
● మడిగట్లపైనే ప్రాణం విడిచిన మహిళా రైతు కూలీలు
● జి.వెంకటాపురంలో విషాదం
పాలకొండ రూరల్: పుట్టినప్పటి నుంచి వ్యవసాయ పనులు తప్ప మరో పని తెలియని ఆ మహిళలు పొట్ట చేతబట్టుకుని కూలి పనికి వెళ్లి పిడుగుపడి కుప్పకూలి మృతిచెందారు. వ్యవసాయమే ఆధారంగా జీవనం గడుపుతున్న ఆ ఇద్దరి కుటుంబాలపై విధి చిన్నచూపు చూసింది. వ్యవసాయ పనులకు వెళ్లివస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే..పాలకొండ మండలం డోలమడ పంచాయతీ జి.వెంకటాపురం గ్రామానికి చెందిన గొర్ల లక్ష్మి (65), వారాడ రామలక్ష్మి (50) వ్యవసాయ కూలీలు. కుటుంబ పోషణలో భాగంగా వారు గ్రామ సమీపంలోగల వరిపొలాల్లో కలుపు మొక్కలు తీసేందుకు శనివారం వెళ్లారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావతంతో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిరుజల్లులు కురవడంతో సహచర కూలీలు వర్షం పడుతుందని భావించి ముందుగా ఇళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో గొర్ల లక్ష్మి, వారాడ రామలక్ష్మి వారు పనిచేస్తున్న పొలాల నుంచి బయటకు వచ్చి గట్లపై నడుస్తుండగా భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో వారిద్దరు ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. ఈ విషయం గమనించిన సహచర కూలీలు భయాందోళకు గురై ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. అప్పటికే గ్రామంలో కొలువుదీర్చిన గణనాఽథుని నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతున్న ప్రజలంతా ఒక్కసారిగా ఘటనా స్థలానికి పరుగులు తీశారు. అప్పటికే ఆ మహిళలు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అందరితో కలివిడిగా..
వ్యవసాయ నేపథ్యం కలిగిన గొర్ల లక్ష్మిది మధ్యతరగతి కుటుంబం కావడంతో జీవనోపాధిలో భాగంగా పొలాల్లో భర్త జోగినాయుడితో కలిసి వ్యవసాయం చేస్తూ నెట్టుకొస్తున్నారు. వారికి పిల్లలు లేకపోవడం, తోడునీడగా ఉన్న భార్య పిడుగుపాటుకు గురై మరణించడంతో జోగినాయుడు గుండెలవిసేలా రోదించాడు. అందరితో కలివిడిగా ఉంటూ గ్రామస్తులకు తలలో నాలులా ఉన్న లక్ష్మి మరణంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులకు ఒంటరి అయిన జోగినాయుడిని ఓదార్చడం వారితరం కాలేదు.
నన్ను వదిలి వెళ్లిపోయావా..
పిడుగు పడి తన భార్య మరణించడంతో వారాడ రామలక్ష్మి భర్త అప్పలనాయుడు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. కలుపు తీసేందుకు వెళ్లిన భార్యపై విధి చిన్నచూపు చూపిందని తనకు దిక్కెవరని రోందించిన తీరు అందరినీ కలిచివేసింది. తన ఇద్దరు పిల్లలు జీవనోపాధికి వలస వెళ్లగా నువ్వుకూడా నన్ను వదివెళ్లావా అంటూ భార్య మృతదేహంపై పడి రోదించాడు. ఈ విషయం తెలుసుకున్న పాలకొండ డిప్యూటీ తహసీల్థార్ సీహెచ్ రమేష్, ఆర్‌ఐ మహేష్ మృతుల గ్రామానికి చేరుకుని వారి కుటుంబాలను ఓదార్చారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తమ ప్రగాఢ సంతాపాన్ని మీడియా ముఖంగా తెలిపారు.


