కులాల లెక్కలు లీక్‌? | - | Sakshi
Sakshi News home page

కులాల లెక్కలు లీక్‌?

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

విజయనగరం అర్బన్‌: నగరపాలకక సంస్థ ఎన్నికల రిజర్వేషన్లకు కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో గోప్యత ప్రశ్నార్ధకంగా మారింది. కులాల వారీగా ఓటర్ల గుర్తింపు, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తయి.. తుది జాబితా విడుదలకు రంగం సిద్ధమైన వేళ, ఆ వివరాలు ముందుగానే అధికార పార్టీకీ చెందిన ఓ కీలక ప్రతినిధికి చేరాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రిజర్వేషన్ల ఖారారుకు ఉపయోగించే కులాల వారీ ఓటర్ల సంఖ్య, వార్డుల వారీ వివరాలు అత్యంత కీలకం. నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సంబంధిత వివరాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగాల్సి ఉంది.

హోటల్‌లోనే ‘డేటా’ వివరించారా?

మున్సిపల్‌ కార్యాలయంలో కులాల వారీ ఓటర్ల జాబితాపై ఈ చర్చ జరిగితే విషయం బహిరంగమయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో... పట్టణంలోని ఓ హోటల్‌లో అధికార పార్టీ ప్రతినిధితో మున్సిపల్‌ ప్లానింగ్‌ విభాగానికి చెందిన కొందరు సిబ్బంది సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా వార్డు వారీగా కులాల ఓటర్ల సంఖ్య, ఏయే వార్డుల్లో ఏ వర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న అంశాలను వివరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ సమావేశం నిజంగా జరిగిందా? జరిగితే అక్కడ ఏ సమాచారం పంచుకున్నారు? అధికారికంగా వెల్లడించాల్సిన వివరాలను ముందుగానే ఎవరికై నా అందించారా? అన్నది తేలాల్సి ఉంది.

తుది జాబితా ముందే అభ్యర్థుల కసరత్తా?

రిజర్వేషన్‌కు సంబంధించిన తుది జాబితా ఇంకా అధికారికంగా విడుదల కాకముందే శనివారం రాత్రి అధికార పార్టీ, కూటమి వర్గాలకు చెందిన ఆశావాహులు కొన్ని వార్డులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆయా వార్డుల్లో ఏ సామాజిక వర్గానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్న లెక్కల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సాధారణ ప్రజలకు, ఇతర రాజకీయ పార్టీలకు అందుబాటులోకి రాని సమాచారం ఒక వర్గానికి ముందుగానే చేరడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

తుది జాబితా రాకముందే అధికార

పార్టీ చేతికి లెక్కల జాబితా

ఓ ప్రైవేట్‌ హోటల్‌లో పార్టీనేతల రహస్య భేటీ

రిజర్వేషన్ల మేరకు అభ్యర్థుల ఎంపికపై చర్చ

మున్సిపల్‌ తీరుపై ప్రశ్నలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement