ఈ చిత్రం చూశారా... ఇది కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 146–1లో ఐదు ఎకరాల 16 సెంట్లు విస్తీర్ణంలోని గెడ్డవాగు. కొంత మంది ఆక్రమణదారులు రైతుల ముసుగులో భారీ వృక్షాలను నరికేసి భూ ఆక్రమణకు తెరతీశారు. ఈ భూమి విలువ రూ.20 కోట్లు ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు.
కొత్తవలస: కొత్తవలస మండలంలోని రెల్లి రెవెన్యూ గ్రామం విశాఖపట్నానికి సరిహద్దుగా ఉంది. కొత్తవలస మీదుగా అనకాపల్లి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ వేస్తున్న రోడ్డుకు ఈ గ్రామం చేరువ. ఈ గ్రామంలో 289 సర్వే నంబర్లలో భూములు విస్తరించి ఉన్నాయి. సర్వేనంబర్ 01లో 979 ఎకరాల కొండ పోరంబోకు భూమి ఉంది. మిగిలిన సర్వే నంబర్లలో గెడ్డ వాగులు, కాలువలు, చెరువులు, కొండవాలు కలిసి సుమారు 700 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇక్కడ సెంటు ధర రూ.4లక్షల నుంచి రూ.5లక్షలు పలుకుతోంది. అంతే... అధికార బలంతో ఆక్రమణదారులు ప్రభుత్వ భూముల కబ్జాకు తెరతీశారు. రాత్రికిరాత్రే చెట్లు నరికేసి భూమిని చదును చేసేస్తున్నారు. ఆక్రమిత భూములకు వెళ్లేందుకు వీలుగా కల్వర్టులు నిర్మించి రోడ్లు వేస్తున్నారు. రోడ్ల పక్కన చిన్న పూరిగుడిసె వేసుకునే పేదలను ఆక్రమణదారులుగా గుర్తించి, పూరిగుడిసెలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణదారుల నుంచి వాటాలు అందుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు ఫిర్యాదు చేసిన సమయంలో ఆక్రమిత భూములు పరిశీలించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేస్తున్న అధికారులు... తర్వాత అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు ఆక్రమణలకు సహకరిస్తున్నారన్న వాదన ఉంది. భూ కబ్జాదారుల వెనుక బడా‘బాబు’ల హస్తం ఉన్నట్టు సమాచారం.
రెల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులను గడ్డిపూసతో సమానంగా ఆక్రమణదారులు పీకిపారేస్తున్నారు. కొన్నిచోట్ల బోర్డులను అలాగే ఉంచి ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నారు. గ్రామస్తులు ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. అధికారులు సైతం ‘ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు తప్పవు’ అంటూ తూతూ మంత్రంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారే తప్ప ఆయా బోర్డుల్లో కనీసం రెవెన్యూ గ్రామం పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం, అధికారుల ఫోన్ నంబర్లు వంటివి కనిపించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఆక్రమణలను అడ్డుకోవాలని రెల్లి గ్రామస్తులు విజ్ఞప్తిచేస్తున్నారు.
రెల్లి రెవెన్యూ పరిధిలో జరుగుతున్న భూ ఆక్రమణలు నా దృష్టికి వచ్చాయి. సంబంధిత భూములు రెవెన్యూ రికార్డుల ఆధారంగా ప్రభుత్వ భూములే. ఈ భూములను ఎవరికీ అసైన్డ్ చేయడంగాని, పట్టాలు ఇవ్వడం గాని జరగలేదు. క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశాను. ఆయా భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాం. ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
– ఎస్.రామలక్ష్మి, తహసీల్దార్, కొత్తవలస
హెచ్చరిక బోర్డులను లెక్కచేయకుండా...
ఈ చిత్రం చూశారా.. రెల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 21లో 11, 13, 15లో సుమారు ఎకరా 40 సెంట్లు కొండ పోరంబోకు భూమి ఇది. ఇందులోని నీలగిరి చెట్లను నరికేసి జిరాయితీ భూమివలే దుక్కిచేసి సాగుచేశారు. ఆ భూమిని ఆక్రమించడం నేరం అంటూ రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డు సాక్షిగా ఆక్రమణలకు బరితెగించడం గ్రామస్తులతో పాటు అధికారులను నివ్వెరపరుస్తోంది.
చిత్రంలోని కల్వర్టును చూశారా.. ఇది ప్రభుత్వ నిధులతో నిర్మించినది కాదు. కొండపోరంబోకు, గెడ్డవాగులను రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు ఆక్రమణదారులు పూనుకున్నారు. రోడ్డు వేసేందుకు వీలుగా గెడ్డపై ఏకంగా కల్వర్టును నిర్మించేశారు. ఈ స్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హెచ్చరిక బోర్డులు విసిరేసి ప్రభుత్వ భూములు కబ్జా
రెల్లి గ్రామంలో రెచ్చిపోతున్న
భూ బకాసురులు
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల
దురాక్రమణ
ఆక్రమణదారుల వెనుక బడాబాబులు
అధికారుల అండదండలతోనే
భూదందా సాగుతోందన్న ఆరోపణలు
ఆక్రమణలను
గుర్తించాం


