● హౌస్ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలి
● ఏపీ పాలరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు
విజయనగరం ఫోర్ట్: విశాఖ డెయిరీలో అవినీతి, అక్రమాలపై హౌస్ కమిటీ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని ఏపీ పాలరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డెయిరీలో అవినీతి అక్రమాలపై పాల రైతుల సంఘం 20 అంశాలపై అధారాలతో హౌస్ కమిటీకి, ప్రభుత్వానికి, రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు ఏ చర్యలూ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హౌస్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. డెయిరీ యాజమాన్యం లాభాలు కాజేస్తూ నష్టాలు చూపిస్తోందని మండిపడ్డారు. పాడి రైతులు ధర రాక తీవ్ర నష్టాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మర్రాపు సూర్యనారాయణ, గొంప కృష్ణమూర్తి, లోకవరపు ఆదినారాయణ మూర్తి, రాములు, సత్యం పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు.


