● ముందే మోగించిన ఎన్నికల ‘గంట’
● మేయర్ పదవి కోసం కర్చీఫ్‌లు సిద్ధం
● ఒక్కోరూట్లో ఒకొక్క నాయకుడి పయనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో కూటమి నాయకులు మేయర్ పదవిపై కన్నేసి ఇప్పటినుంచే తమకు తోచినట్టుగా పావులు కదుపుతున్నారు. గెలుపు అవకాశాలను పక్కనపెట్టి ఫంక్షన్ల పేరిట కొందరు, పుట్టినరోజు పేరిట కొందరు.. కుల సమీకరణలతో కొందరు.. ఇలా తమ స్థాయిల్లో గ్రూపులు కడుతున్నారు. ఈ తరుణంలోనే ఒక నాయకుడు నిన్న పుట్టినరోజు పండగను ఊరి చివర రిసార్ట్‌లో ఘనంగా చేసుకున్నారు. పట్టణంలో పార్టీకి పెద్దగా ఉన్న ఆయన ముందుగా ‘గంట’ మోగించి నేనున్నాను అనే సంకేతం పంపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ముక్క, మందుతో విందు ఇచ్చి మరి నన్ను కాస్త చూసుకోండి బ్రదర్స్ అని రిక్వెస్ట్ చేశారట. ఇప్పుడు అదే దారిలో మరికొందరు తమ ప్రయత్నాలు ఆరంభించారు. గతంలో 50 వార్డులుగా ఉన్న విజయనగరం కార్పొరేషన్ 62 వార్డులకు పెరగడంతో కార్పొరేటర్ ఆశావహుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు ముగ్గురేసి నాయకులు కార్పొరేటర్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అవనాపు బ్రదర్స్‌కు చోటేది?
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేసిన అవనాపు భావన తన భర్త విక్రమ్‌తో కలిసి జనసేనలో చేరారు. అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజుకు, పార్టీ ఆవిర్భావ సభకు, నాగబాబుకు ఫ్లెక్సీలు పెడుతూ ప్రోగ్రాంలు చేస్తున్నారు. అయినా సరే ఈ దంపతులకు ఇంకా పార్టీలో సరైన గుర్తింపు రాలేదు. వైఎస్ జగన్ హయాంలో మంచి గుర్తింపు పొందిన ఈ దంపతులు ఎందుకు పార్టీ మారారో.. మారి ఇక్కడ ఏం బావుకున్నారో తెలియడం లేదని అవనాపు అభిమానులు అంటున్నారు. ఇక ఆయన సోదరుడు అవనాపు విజయ్ కూడా టీడీపీలో చేరి అదితి ఆశీస్సుల కోసం తాపత్రయపడుతున్నారు. ఈయన కూడా భోజనాలు. ఫ్లెక్సీలు.. పత్రికా ప్రకటనలు ఇస్తూ ఖర్చు చేస్తున్నారు.. కానీ ఆయనకు ఎక్కడ ఎలా సర్దుబాటు చేస్తారన్నది ప్రశ్నార్థకం.


