ఏసీబీ వలలో ఇరిగేషన్‌ ఏఈ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఇరిగేషన్‌ ఏఈ

Aug 20 2026 7:38 AM | Updated on Aug 20 2026 7:38 AM

విజయనగరం టౌన్‌: జిల్లా జలవనరు శాఖ ఏఈ, గరివిడి మండలం కొండలక్ష్మీపురం పంచాయతీ ప్రత్యేకాధికారి కింతలి మహేష్‌ రూ.15వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ చిక్కారు. ఈ మేరకు ఏసీబీ శ్రీకాకుళం ఇన్‌చార్జి డీఎస్పీ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కొండలక్ష్మీపురంలో కోళ్లఫారం పెట్టుకునేందుకు అనుమతులు మంజూరు కోసం అవసరమైన సంతకం కోసం ఏఈ రూ.15వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల బృందం విజయనగరం ఐస్‌ఫ్యాక్టరీ కూడలి వద్ద ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి సమీపంలో బాధితుడి నుంచి ఏఈఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో మహేష్‌ను హాజరుపరుస్తామని అధికారులు చెప్పారు.

వాయు కాలుష్యాన్ని తగ్గించాలి

విజయనగరం రూరల్‌: జిల్లా కేంద్రంలో వాయు కాలుష్య నియంత్రణకు సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ కార్యక్రమంపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం సమీక్షించారు. నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ కార్యక్రమంపై కాలుష్య నియంత్రణ ఇంజనీర్‌ బిబి సరిత వివరించారు. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న 131 నగరాల్లో విజయనగరం ఉందని తెలిపారు. ఇప్పటివరకు కాలుష్యనివారణకు పట్టణంలో తీసుకున్న చర్యలను ఆమె తెలియజేశారు. వాయు కాలుష్యంపై పరిశోధన చేసిన ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌.బాలప్రసాద్‌ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో వాయు కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ బాలస్వామి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మణికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

శతశాతం అక్షరాస్యతే లక్ష్యం

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో శతశాతం అక్షరాస్యత సాధించేందుకు కృషిచేద్దామని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 145 కోట్లు పైబడిన మన దేశ జనాభాలో ఇప్పటికే 80 శాతం అక్షరాస్యత సాధించడం గొప్ప విషయమన్నారు. దీనికోసం ఉల్లాస్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దీనిని నిరాక్షరాస్యులు సద్వినియోగం చేసుకుని అక్షరాస్యులుగా మారాలన్నారు. అక్షరాలు రాయడం, చదవడంతో పాటుగా సామ న్య పరిజ్ఞానం, ఆర్థిక అక్షరాస్యతపై 100 గంటల శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వయోజన విద్య ఉప సంచాలకులు ఎ.సోమేశ్వరావు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు

విజయనగరం ఫోర్ట్‌: లింగ నిర్ధారణచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు హిమోగ్లోబిన్‌, బీపీ వంటి కీలక పరీక్షలతో పాటు సకాలంలో అన్ని వైద్యపరీక్షలు పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల పరిధిలోని 19 స్కానింగ్‌ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రి పరిధిలోని 109 స్కానింగ్‌ సెంటర్లలో స్కానింగ్‌ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు ఉత్తమ సేవలు అందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఎస్‌.జీవనరాణి, డీసీహెచ్‌ఎస్‌ పద్మశ్రీరాణి, ఆర్డీఓ సుధాసాగర్‌, డీఎల్‌ఓ రాణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement