విజయనగరం గంటస్తంభం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా, కార్యదర్మి మల్లికార్జున ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈఓలు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలకు సంబంధించి వార్డులు వివరాలు, రిజర్వేషన్లు, ఓటర్ల సంఖ్య తదితర సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, ఫర్నిచర్, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలను సేకరించి అవసరానికి అనుగుణంగా కేటాయింపులు చేపట్టాలని, వారికి నిబంధనలు, విధివిధానాలపై దశలవారీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అర్బన్ లోకల్ బాడీలకు నోటిఫికేషన్ జారీ చేసిన 15వ రోజున పోలింగ్, 18వ రోజున ఫలితాలు ప్రకటించే విధంగా ప్రణాళిక ఉంటుందని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 16వ రోజున పోలింగ్, 19వ రోజున ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన 14వ రోజున పోలింగ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామగ్రి, మౌలిక వసతుల ఏర్పాట్లపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వివరించారు. సమావేశంలో జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ లవరాజు, డీపీఓ మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.


