సచివాలయ ఉద్యోగులపై సర్కారు చిన్నచూపు! | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులపై సర్కారు చిన్నచూపు!

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

విజయనగరం అర్బన్‌:

స్వాతంత్య్ర దిన వేడుకల సాక్షిగా సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షధోరణి మరోసారి బయటపడింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు, పౌరసేవలను నిరంతరం అందిస్తున్న గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే వ్యూహంతోనే ఈసారి కూడా ఉత్తమ సేవా పురస్కారాల ఎంపికలో సంబంధిత సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిబ్బందిని కుదించడం, సేవలను నిర్వీర్యంచేసే దిశగా పాలన సాగిస్తున్న ప్రభుత్వం... ఇప్పుడు అవార్డుల్లోనే వివక్ష చూపి ఆ వ్యవస్థపై మరోసారి తమ కక్షను వెళ్లగక్కిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి.

శ్రమ ఒకరిది.. ఫలితాలు ఇంకొకరివా?

జిల్లా వ్యాప్తంగా 88 శాఖల నుంచి మొత్తం 521 మందికి అవార్డులు ప్రకటిస్తే అందులో 62 మంది జిల్లా స్థాయి అధికారులే ఉన్నారు. మరో వంద మంది వరకు మండల స్థాయి అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. జిల్లాలో వెయ్యి మంది కూడా లేని రెవెన్యూ విభాగానికి ఏకంగా 70 అవార్డులు కట్టబెట్టిన అధికారులు, రేయింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ 540కి పైగా సేవలు అందిస్తున్న 5,800 మంది సచివాలయ సిబ్బందికి మాత్రం కేవలం 10 నుంచి 15 అవార్డులు విసిరేసి చేతులు దులుపుకున్నారు. గత ప్రభుత్వంలో ప్రజాదరణ పొందిన సచివాలయ వ్యవస్థ గుర్తింపును చెరిపేయాలని, పనిచేసే సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీసి ఆ వ్యవస్థను దానంతట అదే మూతపడేలా చేయాలనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటోందని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

శ్రమిస్తున్న ఉద్యోగులకు దక్కని ప్రశంసలు

జిల్లాలో 5,800 మంది సచివాలయ సిబ్బందిలో కేవలం 10 మందికే గుర్తింపు

వెయ్యి మంది కూడా లేని రెవెన్యూ యంత్రాంగానికి ఏకంగా 70 అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement