విజయనగరం:
దేశ ప్రజలందరి సమన్వయంతో అభివృద్ధిలో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలవడం శుభ పరిణామమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని రింగ్‌రోడ్డు ప్రాంతంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణపతకాన్ని ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధనలో మహనీయుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు మతకల్లోలాలు, యుద్ధ వాతావరణం, అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుండగా, విభిన్న మతాలు, జాతులు, ప్రాంతాలు, భాషలు కలిగి ఉన్న భారతదేశం పట్టిష్టంగా ఉందన్నారు. ఇందుకు మన రాజ్యాంగ రూపకల్పనలో మహనీయులు ఆలోచనలు గొప్పవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు చట్టాలను అపహాస్యం చేస్తూ అణిచివేత ధోరణిలో పాలన సాగించడం దురదృష్టకరమన్నారు. ప్రశ్నించేవారిపై కక్షపూరిత చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాగించిన మంచి పాలనతోనే భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయిందని, ప్రపంచ పటంలో జిల్లాకు స్థానం దక్కిందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్య దర్శి కోలగట్ల శ్రావణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, జిల్లా మహిళావిభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధపాలన దురదృష్టకరం
జెడ్పీ చైర్మన్, వైస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా మువ్వన్నెల పండగ


