● రిజిస్ట్రేషన్‌లేని క్రాఫ్ట్ ఉడ్ బ్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే బేబినాయన
● డిప్యూటీ సీఎం వర్చువల్ కార్యక్రమానికి అంతరాయం
బొబ్బిలి: అటవీశాఖ దాదాపు నాలుగైదు నెలల కిందట సమకూర్చిన పనస కలప వీణ కార్మికుల చేతికి ఇప్పటికీ చేరలేదు. అటు నాయకులు, ఇటు అధికారులు ఊరిస్తున్నారే తప్ప కలప అందజేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. పనస కలప ధర పెరగడం, ముడిసరుకు దొరకక పోవడంతో కార్మికులకు పనికరువైంది. వీణ కార్మికుల వినతి మేరకు ఉపముఖ్యమంత్రి సూచనలతో అటవీశాఖ అఽధికారులు రూ.10 లక్షల కార్పస్ ఫండ్‌ను పనస కలప కోసం కేటాయించారు. ఇందులో రూ.5 లక్షలతో పనస కలప కొనుగోలు చేసి 50శాతం రాయితీపై కార్మికులకు అందజేస్తామని చెప్పారు. ఈ కలపను రాయితీపై అందజేయాలంటే ఉడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. దీనికి ఫర్మ్ రిజస్ట్రేషన్ చేయాలి. ఆ ప్రక్రియ ఇప్పటికీ పూర్తిచేయలేదు. ఈనెల 15న పవన్ కల్యాణ్ కలపను వర్చువల్‌గా కార్మికులకు అందజేస్తారని ప్రకటించారు. వర్చువల్ కార్యక్రమానికి కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వస్తారని శనివారం గొల్లపల్లి వీణల కేంద్రం వద్ద టెంట్లు వేశారు. హమ్మయ్య.. ఇప్పటికై నా పనస కలప సబ్సిడీ ధరకు చేతికి వస్తుందని, నాలుగు వీణలు చేసుకుని కాసులు కళ్లచూద్దామని వీణ కార్మికులు సంబరపడ్డారు. వర్షానికి కారుతున్న టెంట్ల కింద కూర్చొని నిరీక్షించారు. అయితే, ఎమ్మెల్యే బేబినాయన ఒక్కరడే ఉడ్‌బ్యాంక్ అంటూ రిబ్బన్ కత్తిరించారు తప్పితే కలపను కార్మికులకు అందజేయలేదు. పవన్ వర్చువల్ కార్యక్రమానికి సాంకేతిక అంతరాయం కలిగింది. విశాఖ రేంజ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రాజు వచ్చినా అటు కార్మికులకు, ఇటు మీడియాకు ఏ విధమైన సమాచారం చెప్పకుండా వెళ్లిపోయారు. కలప ఇవ్వకపోవడంతో వీణ కార్మికులు ఎదురుచూసి నిరాశతో వెళ్లిపోయారు. ఉడ్ బ్యాంకు ఏర్పాటుకు ఫర్మ్ రిజిస్ట్రేషన్ జరగనందునే కలప ఇంకా వీణ కార్మికులకు అందజేయలేదని, ఈ విషయం తెలిసి అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వనట్టు సమాచారం. ఫర్మ్ రిజిస్ట్రేషన్ కాని ఉడ్‌బ్యాంకును ఎమ్మెల్యే ప్రారంభంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్చువల్‌గా చూపేందుకు బయటకు తీసిన పనస కలపను మళ్లీ యథావిధిగా గొడౌన్‌లో సర్దేశారు.
ఎయిర్‌పోర్టుకు సీఐఎస్‌ఎఫ్ భద్రత
● సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్
పూసపాటిరేగ: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రక్షణ బాధ్యతలను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) అధికారికంగా శనివారం స్వీకరించింది. ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో జెండా, తాళాల అప్పగింత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇకపై భోగాపురం విమానాశ్రయానికి పటిష్టమైన భద్రతా కవచంగా సీఐఎస్‌ఎఫ్ నిలవనుంది. కార్యక్రమంలో పాల్గొన్న సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్ మాట్లాడుతూ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 31 నెలల రికార్డు సమయంలో నిర్మా ణం పూర్తి చేసుకోవడం విశేషమన్నారు. విమానాశ్రయం ప్రారంభమైన తొలిరోజు నుంచే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులతో సిద్ధంగా ఉండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాలకు విమానాశ్రయం తూర్పు ద్వారంగా నిలవనుందన్నారు. విమానాశ్రయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూనే, ప్రయాణికులకు సౌకర్యవంతమైన, స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే సీఐఎస్‌ఎఫ్ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో భద్రతా విధుల్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. విమానాశ్రయంలో ఈ నెల 17 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య విమాన రాకపోకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సీఐఎస్‌ఎఫ్ పూర్తి చేసిందని తెలిపారు. ముందుగా విమనాశ్రయ ప్రాంగణంలో సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు, సిబ్బంది కలిసి జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


