● వాడేసి పక్కన పడేసిన ఎమ్మెల్యే
● ఆయనను నమ్ముకున్న క్యాడర్ కుయ్యోమొర్రో
● పోయాం మోసం
అని లోలోన ఆవేదన
● జగదీశ్వరి నిజరూపం తెలిసొచ్చిందని
లోలోన మంట
ఇదిలా ఉండగా వీరేష్ తండ్రి ప్రదీప్ కాలం నుంచి కురుపాం కోటతో సంబంధం ఉన్న కొద్దిమంది నాయకులు ఇప్పటికీ ఈ కుటుంబానికి విధేయులుగా ఉంటూ ఆ నమ్మకంతోనే వీరేష్ వెంట నడిచారు. జగదీశ్వరి గెలిస్తే వీరేష్ గెలిసినట్లే అని, ఆయన ఎమ్మెల్యే అయినట్లే.. మండలంలో.. నియోజకవర్గంలో తమ పెద్దరికం సాగుతుందని ఆశిస్తూ పనిచేసిన చాలామంది టీడీపీ నాయకులూ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరేష్‌ను పట్టించుకోని ఎమ్మెల్యే ఇక తమను ఏం చూస్తుంది.. అలాగని ఈ అవమానం.. వాడకం మీద ఎవరినీ ఏమీ అడగలేని, ప్రశ్నించలేని దైన్యంలో టీడీపీ నాయకులు మింగలేక కక్కలేక ఊరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం సమర్తి భోజనాలకు సైతం చందాలు వసూలు చేస్తూ దందా చేస్తున్నారన్న కడుపుమంటతో క్యాడర్ లోలోన మదనపడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు.. బదిలీలు, పోస్టింగులు.. ఇలాంటి పనులు కూడా తమ నాయకుడి చేసే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ క్యాడర్ పోయాం మోసం.. పోయాం మోసం అనుకుంటూ వెర్రి నవ్వులు నవ్వుకుంటున్నారు.
‘ఒక వ్యక్తి నిజరూపం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలి’ అనే అబ్రహం లింకన్ సూక్తి కురుపాంలో అక్షరాలా అమలవుతుండడాన్ని కళ్లారా చూస్తున్నాం అని క్యాడర్‌లో చర్చసాగుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
కబోదికి కళ్లు రాగానే ముందుగా పక్కనపడేసేది అంతవరకూ తనను నడిపించిన వాకింగ్ స్టిక్‌నే. అవిటి వానికి కాళ్లొస్తే ముందుగా విసిరేసేది ఊతకర్రనే. చెవిటివానికి వినికిడిలోపం నివారణ అయితే సౌండ్ మిషన్ వెళ్లేది చెత్త డబ్బాలోకే.. అచ్చం రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి. జీరో నాలెడ్జ్‌తో రాజకీయాల్లోకి వచ్చిన ఎంతోమంది నాయకులు... తమను నడిపించి.. నిలబెట్టి.. ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఊతకర్రల్లాంటి నాయకులను తాము నడకనేర్వగానే పక్కన పడేస్తున్నారు. కురుపాంలో కూడా అచ్చం ఇదే జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
● గెలిపించిన వారికే
రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన జగదీశ్వరికి అనుకోకుండా కురుపాం ఎమ్మెల్యే టిక్కెట్ దక్కింది. వాస్తవానికి ఆమెకు రాజకీయాలు కాదు సరికదా నియోజకవర్గ సరిహద్దులు.. మండలాలు.. సామాజిక సమీకరణాలు గురించి కూడా పెద్దగా తెలియదనేది ఆ నియోజకవర్గ ప్రజల మాట. అప్పట్లో కురుపాం సంస్థానానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్, ఆయన సోదరుడు ప్రదీప్‌దేవ్‌ల ఆశీస్సులతో ఆమె రంగంలోకి దిగారు. దీంతో వారు ప్రదీప్‌చంద్రదేవ్ కుమారుడు అయిన వీరేష్‌దేవ్ అనే యువకుడిని రంగంలోకి దించి జగదీశ్వరి గెలుపు బాధ్యతలు అప్పగించారు. కుర్రవాడు.. రాజకీయాల్లో రాణించాలన్న ఉత్సాహం ఉన్నవాడు.. కుటుంబ వారసత్వం.. నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నవాడు కావడం.. అవినీతి మకిలి అంటని ఫ్యామిలీ కావడంతో కొద్దికాలంలోనే నియోజకవర్గంలో త్వరగానే పట్టు సాధించారు. ఆమెను కాదు మా ఫ్యామిలీని చూడండి అంటూ ఆయన జగదీశ్వరిని వెంటబెట్టుకుని ఊరూరా తిరిగి గెలిపించండి.. పనులు కావాలంటే నన్ను అడగండి.. మీకు నేను భరోసా అన్నట్లుగా క్యాడర్‌కు, ప్రజలకు హామీలు ఇచ్చారు. మొత్తానికి ఆమె గెలిచేశారు. గెలిచాక కొద్దిరోజులు ఆమె వీరేష్ కనుసన్నల్లో మెలిగారు. కొత్తలో ఆయనపట్ల అభిమానం.. విధేయత చూపారో.. నటించారో తెలియదు కానీ కొన్నాళ్లు సవ్యంగానే సాగింది. అబ్బో ఎమ్మెల్యే... మా వీరేష్‌కు బాగానే ప్రాధాన్యం ఇస్తున్నారన్న భ్రమలు క్యాడర్‌లో కలిగాయి. వీరేష్ కూడా ఉన్నంతలో నిజాయితీగా ఆమెను వేలు పట్టుకుని నడిపించారు. రాజకీయం.. పాలనాపరమైన పలు అంశాల్లో సలహాలు ఇస్తూ ముందుకు నడిపించారు. బాగానే ఉంది.. కానీ ఎన్నాళ్లని ఒకరి అడుగులో అడుగు వేస్తాం.. మనం సొంతంగా నడవలేమా.. ఎన్నాళ్లని ఆయన కళ్లతో చూస్తాం.. మనకళ్లతో మనం చూడలేమా..? మన బుర్రతో మనం ఆలోచించలేమా..? అనే ఆలోచన మొదలైన జగదీశ్వరి భర్తను పీఏగా పెట్టుకున్నారు.
పనులు, పథకాలు.. పదోన్నతులు, పోస్టింగులు.. బదిలీలు ఎక్కడ ఏది అవకాశం దొరికితే అక్కడ చందా దందా మొదలెట్టారన్నది ఆరోపణ. కొద్దిరోజుల్లేనే అధికారం రుచి తెలిసింది. మెల్లగా స్వతంత్రంగా ఆలోచించడం మొదలైంది. ఇవన్నీ తాము సొంతంగా చేసుకునేటప్పుడు పక్కన వీరేష్ ఎందుకు అనే ఆలోచన మొదలవడంతో మెల్లగా ఆయనను దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం తగ్గించారు. ఎక్కడ ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలి.. బదిలీలు చేయాలి.. ఏ పోస్టింగ్‌కు ఎంత రేటు అనేది తమ అంతరంగికులు ఇద్దరు ముగ్గురితో చర్చించుకుంటూ ఫైనల్ చేసేస్తున్నారు. వీరేష్ నుంచి రిఫరెన్స్ వస్తే అందులో ఏమీ పైసలు రావు.. పైగా తమ ప్రయోజనాలు .. స్వలాభం కుదరదు.. అందుకే ఆయన చెప్పినా మెల్లగా ఏదో సాకుతో మాట దాటేస్తున్నారు. దీంతో విషయం అర్థమై వీరేష్ కూడా మెల్లగా సైలెంట్ అయిపోయారు. ఉండీలేనట్లు.. ఉన్నా లేనట్లు కురుపాంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొనడం తప్ప ఎమ్మెల్యేకు సలహాదారుడు పాత్ర నుంచి మెల్లగా తప్పుకున్నారు.
పీఏగా ఉన్న భర్త , ఓ మాజీ జెడ్పీటీసీ, ఓ యువనేతతో కలిపి ఎమ్మెల్యే సొంతంగా తమ రీతిలో పాలన సాగిస్తూ వీరేష్‌ను మెల్లగా సైడ్ చేసేశారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.
కుర్చీ వేయలేదా?
ఇటీవల గుమ్మలక్ష్మీపురం సామజిక ఆస్పత్రి అదనపు భవనాల ప్రారంభోత్సవానికి వెళ్లిన వీరేష్‌ను కనీసం వేదిక మీదకు పిలవలేదట. దీంతో ఆయన సభికుల మధ్య ఎక్కడో కూర్చున్నారట. అందరూ వేదిక ఎక్కాక.. ఎవరో గుర్తు చేస్తే కిందనున్న ఒక కుర్చీని తీసుకెళ్లి వేదిక మీద వేసి ఆయనను చివర్లో పిలిచి కూర్చోబెట్టడాన్ని చూసి ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. వీరేష్ పరిస్థితి ఇలా అయిపోయిందా అంటూ నిట్టూర్చారు.


